
మరో 2 వేల కానిస్టేబుల్ పోస్టులు
♦ 1,702 ఏఆర్, 298 సివిల్ ఖాళీల భర్తీకి హోంశాఖ ఉత్తర్వులు
♦ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్న రిక్రూట్‌మెంట్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరిన్ని పోలీసు కొలువులకు తెరలేచింది. ఇప్పటికే 9,613 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తుల ప్రక్రియను ముగించిన ప్రభుత్వం తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మరో రెండు వేల కానిస్టేబుల్ పోస్టులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ కూడా సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. దీంతో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
ఈ పోస్టులను పూర్తిగా కమిషనరేట్ల పరిధిలో భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 1,702 ఆర్ముడ్ రిజర్వ్ (ఏఆర్) విభాగానికి చెందినవి ఉండగా మిగిలిన298 పోస్టులు సివిల్ విభాగానికి చెందినవి. అలాగే ఈ పోస్టులలో హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో 1,055 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు కేటాయించగా సైబరాబాద్ కమిషనరేట్‌కు సంబంధించి 255 సివిల్, 599 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులను కేటాయించారు. కొత్తగా కమిషనరేట్‌గా రూపాంతరం చెందిన వరంగల్ సీపీ పరిధిలో 43 సివిల్ కానిస్టేబుళ్లు, 48 ఏఆర్ కానిస్టేబుళ్లు పోస్టులను కేటాయించారు.