
స్వైన్‌ఫ్లూతో మరో ముగ్గరు మృతి
హైదరాబాద్(గాంధీ ఆస్పత్రి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ బాధితులు శనివారం మృతిచెందారు. దీంతో జనవరి నెలలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 21కు పెరిగింది. నల్లకుంటకు చెందిన బాబురావు (77), చంచల్‌గూకు చెందిన మహతాకాతూన్ (65), కర్నూలుజిల్లాకు చెందిన గర్భిణీ సరస్వతి (32)లు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై గాంధీ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఒకరు, శనివారం ఉదయం మరో ఇద్దరు మృతిచెందినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు.
గాంధీ ఐసోలేషన్ వార్డులో 35మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని, వీరిలో 12మంది చిన్నారులున్నారని వైద్యులు తెలిపారు. లోటస్ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై వచ్చిన 20 రోజులు వయసుగల ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో 27మంది అనుమానితులకు డిజాస్టర్, ఏఎంసీ వార్డులో వైద్యచికిత్సలు అందిస్తున్నామన్నారు. శనివారం స్వైన్‌ఫ్లూ ఓపీ విభాగంలో 74మందికి వైద్యసేవలు అందించామని, వీరిలో 34మంది చిన్నారులున్నారని, మందులు అందించి హోం ఐసోలేషన్‌లో ఉంచామని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.