అంత్య పుష్కర సంరంభం
* తొలిరోజు లక్ష మందికిపైగా భక్తుల పుణ్యస్నానాలు
* గోదావరి వెంట పుణ్యక్షేత్రాల్లో సందడి
సాక్షి నెట్‌వర్క్: పుణ్యక్షేత్రాలు శోభిల్లాయి.. భక్తజన సందడితో గోదారి పులకించింది.. ఆదివారం గోదావరి అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ క్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంత్రి ఈటల రాజేందర్ అంత్య పుష్కరాలను ప్రారంభించారు. తొలి రోజు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఈ నెల 11 వరకు పుష్కర సందడి కొనసాగనుంది.
పులకించిన భద్రాద్రి
ఖమ్మం జిల్లా భద్రాచలంలో తెల్లవారుజామున 6 నుంచి గౌతమీ మాత వేడుక ఆరంభమైంది. సీతారాముల మూర్తులతో వేద పండితుల సామూహిక స్నానాలతో అంత్య పుష్కరాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. రాములోరి ప్రతిమలు, శ్రీపాదుకలు, చక్ర పెరుమాళ్లకు జలాభిషేకం తర్వాత భక్తజనం గోదారమ్మ ఒడిలో తరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి స్నానాలు చేశారు. హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ శ్రీపాదుకలను తలపై పెట్టుకొని, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పుష్కర స్నానమాచరించారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు పుష్కర స్నానం చేసినట్టు అంచనా. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, చెన్నూరు, మంచిర్యాల ఘాట్లలో 24 వేల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరించారు.
కరీంనగర్‌లో 35 వేల మంది..
గుంటూరుకు చెందిన దత్త పీఠాధిపతి విశ్వంజీ విశ్వయోగి మహరాజ్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి ఈటల రాజేందర్ ధర్మపురిలో అంత్య పుష్కరాలు ప్రారంభించారు. కృష్ణా పుష్కరాలను సైతం ఇదే స్థారుులో నిర్వహించేందుకు సీఎం ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జిల్లాలోని పలు ఘాట్ల వద్ద దాదాపు 35 వేల మంది స్నానాలు ఆచరించారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో, రెంజల్ మండలం త్రివేణి సంగమ క్షేత్రంలో, బాల్కొండ మండలం ఎస్సారెస్పీ వద్ద, మోర్తాడ్ మండలం తడపాకల్‌లో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు.
రాజమహేంద్రవరం.. జనసంద్రం
సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు: దేశంలో ఒక్క గోదావరి నదికి మాత్రమే వచ్చే అంత్య పుష్కర సంరంభం ఆదివారం ఏపీలోనూ ఆరంభమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతీ(వీఐపీ) ఘాట్‌లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ మురళీమోహన్, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు గోదావరి తల్లికి ఉదయం పూజలు చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 11 వరకూ గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి.
గతేడాది జూలై 14 నుంచి 12 రోజులపాటు ఆది పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని వివిధ ఘాట్‌లలో, గోదావరి నదీ పాయలలో వేకువజాము నుంచే ప్రజలు అంత్య పుష్కర స్నానాలు ఆరంభించారు. అయితే ఇక్కడ భక్తులు ఆశించిన స్థాయిలో రాలేదు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుమారు 10వేల మంది పుణ్యస్నానాలు ఆచరించగా.. జిల్లావ్యాప్తంగా ఆ సంఖ్య 48వేలు దాటిందని అధికారుల అంచనా. పట్టిసీమ పుష్కర ఘాట్‌లో అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించి, శివక్షేత్రంలోని శ్రీ భద్రకాళీ సమేతవీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు.