antya Pushkaralu
-
ప్రణతి ప్రణతి.. ప్రణవనాద జలధికి..
నాలుగు చినుకులు నెత్తిన పడగానే మేని పులకిస్తుంది. మనసంతా ఆహ్లాదంతో నిండిపోతుంది. నిస్సత్తువ పటాపంచలవుతుంది. ఎక్కడా లేని కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. పంచభూతాల్లో ఒకటైన నీటికి ఉన్న మహత్మ్యం అది. అందుకే.. గోదారి గంగమ్మను భక్త జనమంతా జలదేవతగా ఆరాధిస్తారు. నెత్తిన నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకుంటారు. అంతటి విశిష్టత గల గోదారమ్మకు అంత్య పుష్కర వేళ భక్తులంతా ప్రణతులర్పిస్తున్నారు. పాపాలను బాపే ఆ అమ్మను సేవించి తరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి అంత్య పుష్కరాల జోరు కొనసాగుతోంది. పదో రోజున కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అంత్య పుష్కర ఘట్టం చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఒడిశాలోని కటక్, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని, షాజాపూర్ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో కొవ్వూరు చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. రోజంతా ఇక్కడే ఉండి.. గోదావరి గట్టున వంటలు చేసుకుని ఆరగించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మంగళవారం సుమారు 20 వేల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. వరద ఉధృతి కొనసాగడంతో గోష్పాద క్షేత్రంలోని మొదటి రెండు ఘాట్లలో భక్తులను స్నానాలకు అనుమతించలేదు. తాళ్లపూడిలోని ఘాట్లలో సగానికి పైగా ముంపులో ఉన్నాయి. కేవలం మూడు మెట్లు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. రేవుల్లో ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు మునిగిపోయాయి. ఘాట్ల వద్ద కేవలం ఒక్కొక్క పడవను మాత్రమే ఉంచారు. పట్టిసీమ, పోలవరం, గూటాల పుష్కర ఘాట్లలోనూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పట్టిసీమ ఘాట్‌లో విజయనగరం జిల్లా భక్తులు పుష్కర స్నానం చేశారు. సాయంత్రం గోదావరి మాతకు హారతి ఇచ్చారు. నరసాపురానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోడేరు పుష్కరఘాట్‌లో భక్తులు పెద్దఎత్తున పుణ్యస్నానాలు చేశారు. కరుగోరుమిల్లి పుష్కరఘాట్ మంగళవారం కూడా వరద గుప్పెట్లోనే ఉండటంతో పుష్కర స్నానాలను అధికారులు నిలిపివేశారు. కేదారీ ఘాట్‌లో పుష్కర స్నానాలు చేసి పెనుగొండలో వాసవీ మాతను దర్శనం చేసుకుని వెళుతున్నారు. పోలీసులు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లిపోవడంతో ఘాట్ల వద్ద బందోబస్తు లేదు. చివరి రెండు రోజులైనా పోలీసులను ఏర్పాటుచేయాలని ఘాట్ అధికారులు కోరుతున్నారు. కాగా, పారిశుధ్య సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి వసతి, భోజన సదుపాయాలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకాకపోవడంతో ఆయా శాఖల అధికారులు అవస్థలు పడుతున్నారు. -
గోదావరి అంత్య పుష్కరాల్లో అపశృతి
ధవళేశ్వరం : గోదావరి అంత్యపుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ధవళేశ్వరంలోని కేదారలంక ఘాట్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పవిత్ర స్నానం కోసం నదిలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంత్య పుష్కరాలకు పోటెత్తిన భక్తులు గోదావరి అంత్య పుష్కరాలకు భక్తజనం పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. పుష్కర గ్రామీణ ఘాట్లన్ని కిటకిటలాడుతున్నాయి. పెనుగొండలోని సిద్ధాంతం, పెరవలి తీపర్రు, గన్నవరం వైనతేయ గోదావరి, నిడదవోలు పెండ్యాల, నరసాపురం వశిష్ట గోదావరి, గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. -
భక్త గోదారి
నాసికా త్రయంబకాన ప్రభవిల్లి.. బాసర సరస్వతిని సేవించి.. భద్రాచల రాముడి పాదాలు కడిగి.. పట్టిసీమలో వీరభద్రుణ్ణి కొలిచి.. కొవ్వూరులో గోహత్యా మహాపాతకాన్ని రూపుమాపి.. సిద్ధాంతంలో సిద్ధుల సేదతీర్చి.. నరసాపురంలో నవరసాలొలికించి.. అంతర్వేదిలో అన్నాచెల్లెళ్ల గట్టు వద్ద సముద్రుడిలో సంగమించే జీవనధార.. పావనాంబ గోదారమ్మకు భక్తజనులు అంత్య పుష్కర వేళ ప్రణతులర్పిస్తున్నారు. జోరు వానలోనూ ఆ తల్లి చెంతకు వెళ్లి నీరాజనం పలుకుతున్నారు. పుష్కర సందడికి శ్రావణ శోభ తోడవటంతో జిల్లాలోని పుష్కర ఘాట్లన్నీ గురువారం కిటకిటలాడాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి తీరం భక్త జన సంద్రంగా మారింది. జోరున వాన కురుస్తున్నా.. నదిలో వరద ఉధృతి పెరుగుతున్నా భక్తులు లెక్కచేయడం లేదు. శ్రావణ మాసం ఆరంభం కావడంతో గురువారం ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరిం చారు. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తున్నప్పటికీ భారీగా తరలివస్తూనే ఉన్నారు. పారిశుధ్య సిబ్బంది, భక్తులకు రక్షణ కోసం నదిలో ఉంటున్ను గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బంది వర్షంలో తడుస్తూనే పుష్కర విధులు నిర్వహించారు. శ్రావణ మాసం కావడంతో శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో పోలవరం నుంచి కొవ్వూరు వరకూ ఉన్న ఘాట్లలో భారీగా వరద నీరు చేరింది. మెట్లన్నీ మునగడంతో నీటిపారుదల అధికారులు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అన్ని గేట్లను ఎత్తడంతో సాయంత్రానికి వరద కొంతమేర తగ్గింది. అయితే, ఆనకట్టకు దిగువన ఉన్న పెరవలి, పెనుగొండ, ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని ఘాట్లలో నీటిమట్టం పెరిగింది. పట్టిసీమ, గూటాల, పోలవరం ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పట్టిసీమ శివక్షేత్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. వరద భారీగా పెరగడంతో లాంచీపై నేరుగా శివక్షేత్రానికి చేరుకుంటున్నారు. తాళ్లపూడిలో అర్చకుడు జంధ్యాల గంగాధరశర్మ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు. నరసాపురం వలంధర రేవులో సందడి నెలకొంది. రాత్రివేళ గోదావరి మాతకు అఖండ హారతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారితోపాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా వలంధర రేవులోనే స్నానాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పిండ ప్రదానాలు కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. గోదావరి నదిలో వరద ప్రవాహ తీవ్రత పెరగడంతో పెరవలి మండలంలోని కొన్ని పుష్కర ఘాట్ల వద్ద స్నానాలను నిలిపివేశారు. ఈ మండలంలో 8 పుష్కర ఘాట్లు ఉండగా, ముక్కామల, కాకరపర్రు, కానూరు అగ్రహారం ఘాట్లలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో ఈ ఘాట్లలో భక్తులు అతి తక్కువ సంఖ్యలో స్నానాలు ఆచరించారు. -
అంత్య పుష్కర సంరంభం
* తొలిరోజు లక్ష మందికిపైగా భక్తుల పుణ్యస్నానాలు * గోదావరి వెంట పుణ్యక్షేత్రాల్లో సందడి సాక్షి నెట్వర్క్: పుణ్యక్షేత్రాలు శోభిల్లాయి.. భక్తజన సందడితో గోదారి పులకించింది.. ఆదివారం గోదావరి అంత్య పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బాసర సరస్వతీ క్షేత్రంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మంత్రి ఈటల రాజేందర్ అంత్య పుష్కరాలను ప్రారంభించారు. తొలి రోజు దాదాపు లక్ష మందికిపైగా భక్తులు పుష్కర స్నానాలు చేశారు. ఈ నెల 11 వరకు పుష్కర సందడి కొనసాగనుంది. పులకించిన భద్రాద్రి ఖమ్మం జిల్లా భద్రాచలంలో తెల్లవారుజామున 6 నుంచి గౌతమీ మాత వేడుక ఆరంభమైంది. సీతారాముల మూర్తులతో వేద పండితుల సామూహిక స్నానాలతో అంత్య పుష్కరాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. రాములోరి ప్రతిమలు, శ్రీపాదుకలు, చక్ర పెరుమాళ్లకు జలాభిషేకం తర్వాత భక్తజనం గోదారమ్మ ఒడిలో తరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి స్నానాలు చేశారు. హైకోర్టు జడ్జి దుర్గాప్రసాద్ శ్రీపాదుకలను తలపై పెట్టుకొని, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పుష్కర స్నానమాచరించారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు పుష్కర స్నానం చేసినట్టు అంచనా. ఆదిలాబాద్ జిల్లాలోని బాసర, చెన్నూరు, మంచిర్యాల ఘాట్లలో 24 వేల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరించారు. కరీంనగర్లో 35 వేల మంది.. గుంటూరుకు చెందిన దత్త పీఠాధిపతి విశ్వంజీ విశ్వయోగి మహరాజ్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌తో కలిసి మంత్రి ఈటల రాజేందర్ ధర్మపురిలో అంత్య పుష్కరాలు ప్రారంభించారు. కృష్ణా పుష్కరాలను సైతం ఇదే స్థారుులో నిర్వహించేందుకు సీఎం ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జిల్లాలోని పలు ఘాట్ల వద్ద దాదాపు 35 వేల మంది స్నానాలు ఆచరించారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడలో, రెంజల్ మండలం త్రివేణి సంగమ క్షేత్రంలో, బాల్కొండ మండలం ఎస్సారెస్పీ వద్ద, మోర్తాడ్ మండలం తడపాకల్‌లో ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. రాజమహేంద్రవరం.. జనసంద్రం సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు: దేశంలో ఒక్క గోదావరి నదికి మాత్రమే వచ్చే అంత్య పుష్కర సంరంభం ఆదివారం ఏపీలోనూ ఆరంభమయ్యింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతీ(వీఐపీ) ఘాట్‌లో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ మురళీమోహన్, స్థానిక ఎమ్మెల్యేలు తదితరులు గోదావరి తల్లికి ఉదయం పూజలు చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 11 వరకూ గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. గతేడాది జూలై 14 నుంచి 12 రోజులపాటు ఆది పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే. రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని వివిధ ఘాట్లలో, గోదావరి నదీ పాయలలో వేకువజాము నుంచే ప్రజలు అంత్య పుష్కర స్నానాలు ఆరంభించారు. అయితే ఇక్కడ భక్తులు ఆశించిన స్థాయిలో రాలేదు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుమారు 10వేల మంది పుణ్యస్నానాలు ఆచరించగా.. జిల్లావ్యాప్తంగా ఆ సంఖ్య 48వేలు దాటిందని అధికారుల అంచనా. పట్టిసీమ పుష్కర ఘాట్‌లో అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించి, శివక్షేత్రంలోని శ్రీ భద్రకాళీ సమేతవీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు.