భక్త గోదారి
భక్త గోదారి
Published Thu, Aug 4 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
నాసికా త్రయంబకాన ప్రభవిల్లి.. బాసర సరస్వతిని సేవించి.. భద్రాచల రాముడి పాదాలు కడిగి.. పట్టిసీమలో వీరభద్రుణ్ణి కొలిచి.. కొవ్వూరులో గోహత్యా మహాపాతకాన్ని రూపుమాపి.. సిద్ధాంతంలో సిద్ధుల సేదతీర్చి.. నరసాపురంలో నవరసాలొలికించి.. అంతర్వేదిలో అన్నాచెల్లెళ్ల గట్టు వద్ద సముద్రుడిలో సంగమించే జీవనధార.. పావనాంబ గోదారమ్మకు భక్తజనులు అంత్య పుష్కర వేళ ప్రణతులర్పిస్తున్నారు. జోరు వానలోనూ ఆ తల్లి చెంతకు వెళ్లి నీరాజనం పలుకుతున్నారు. పుష్కర సందడికి శ్రావణ శోభ తోడవటంతో జిల్లాలోని పుష్కర ఘాట్లన్నీ గురువారం కిటకిటలాడాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : గోదావరి తీరం భక్త జన సంద్రంగా మారింది. జోరున వాన కురుస్తున్నా.. నదిలో వరద ఉధృతి పెరుగుతున్నా భక్తులు లెక్కచేయడం లేదు. శ్రావణ మాసం ఆరంభం కావడంతో గురువారం ఉదయం నుంచే భక్తులు పెద్దసంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరిం చారు. అల్పపీడన ప్రభావంతో ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా జల్లులు కురుస్తున్నప్పటికీ భారీగా తరలివస్తూనే ఉన్నారు. పారిశుధ్య సిబ్బంది, భక్తులకు రక్షణ కోసం నదిలో ఉంటున్ను గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బంది వర్షంలో తడుస్తూనే పుష్కర విధులు నిర్వహించారు. శ్రావణ మాసం కావడంతో శుక్రవారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
గోదావరిలో వరద ఉధృతి పెరగడంతో పోలవరం నుంచి కొవ్వూరు వరకూ ఉన్న ఘాట్లలో భారీగా వరద నీరు చేరింది. మెట్లన్నీ మునగడంతో నీటిపారుదల అధికారులు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద అన్ని గేట్లను ఎత్తడంతో సాయంత్రానికి వరద కొంతమేర తగ్గింది. అయితే, ఆనకట్టకు దిగువన ఉన్న పెరవలి, పెనుగొండ, ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని ఘాట్లలో నీటిమట్టం పెరిగింది. పట్టిసీమ, గూటాల, పోలవరం ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పట్టిసీమ శివక్షేత్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. వరద భారీగా పెరగడంతో లాంచీపై నేరుగా శివక్షేత్రానికి చేరుకుంటున్నారు. తాళ్లపూడిలో అర్చకుడు జంధ్యాల గంగాధరశర్మ ఆధ్వర్యంలో గోదావరికి హారతి ఇచ్చారు. నరసాపురం వలంధర రేవులో సందడి నెలకొంది. రాత్రివేళ గోదావరి మాతకు అఖండ హారతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారితోపాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా వలంధర రేవులోనే స్నానాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. పిండ ప్రదానాలు కూడా ఇక్కడే ఎక్కువగా జరుగుతున్నాయి. గోదావరి నదిలో వరద ప్రవాహ తీవ్రత పెరగడంతో పెరవలి మండలంలోని కొన్ని పుష్కర ఘాట్ల వద్ద స్నానాలను నిలిపివేశారు. ఈ మండలంలో 8 పుష్కర ఘాట్లు ఉండగా, ముక్కామల, కాకరపర్రు, కానూరు అగ్రహారం ఘాట్లలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో ఈ ఘాట్లలో భక్తులు అతి తక్కువ సంఖ్యలో స్నానాలు ఆచరించారు.
Advertisement