బిజినెస్ రూల్స్ మార్చేద్దాం! | AP cabinet declares to change business rules | Sakshi
Sakshi News home page

బిజినెస్ రూల్స్ మార్చేద్దాం!

Published Sat, Oct 1 2016 2:41 AM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

AP cabinet declares to change business rules

- రాయితీల అంశాలు
- ఆర్థిక శాఖకు వెళ్లకుండా మార్పులు
- కేబినెట్ నిర్ణయం తర్వాత మూడు రోజుల్లోనే ఉత్తర్వులు
- ప్రభుత్వ పెద్దల ప్రతిపాదనలు.. ఉన్నతాధికారుల ఆందోళన

 
 సాక్షి, హైదరాబాద్:  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక శాఖ చికాకులు సృష్టిస్తోంది.. ఆర్థిక ఫైళ్లపై నిబంధనల పేరుతో అడ్డంగా రాస్తోంది.. దీంతో కావాల్సిన వారికి రాయితీలు ఇవ్వడానికి స్వేచ్ఛ ఉండటం లేదని ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. అందుకే ఏకంగా సచివాలయ బిజినెస్ రూల్స్‌నే మార్చేందుకు సిద్ధమయ్యారు. సచివాలయ పాలనకు బిజినెస్ రూల్స్ కీలకం. ప్రైవేట్ సంస్థలకు రాయితీలు ఇచ్చే విషయంలో ఆర్థిక శాఖ నిబంధనల మేరకు వ్యవహరిస్తోంది.
 
  పెట్టుబడికి మించి రాయితీలు ఇవ్వాలంటూ వస్తున్న ఫైళ్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.. నిబంధనలను గుర్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాయితీలకు చెందిన అంశాల ఫైళ్లు ఆర్థిక శాఖకు వెళ్లకుండా చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆర్థిక అంశాలతో ముడిపడిన అంశాలకు చెందిన ఫైళ్లు ఆర్థిక శాఖకు పంపినప్పటికీ తిరస్కరించకుండా ఉండేలా బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాలని కూడా ప్రతిపాదించారు.
 
 అడ్డూ అదుపూ ఉండదిక...
 ఎప్పటినుంచో ఉన్న బిజినెస్ రూల్స్‌ను మార్చేస్తే ఇక అడ్డూ అదనపు లేకుండా ప్రజాధనాన్ని పాలకులు దోచేసుకుంటారని సీనియర్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేబినెట్ పేరుతో పాలకులు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇప్పుడు బిజినెస్ రూల్స్‌నే మార్చేస్తే యథేచ్ఛగా కావాల్సిన వారికి కావాల్సినంత దోచిపెట్టవచ్చునని, అడిగే నాథుడే ఉండడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎవరికైనా న్యాయం ఒకే రకంగా ఉండాలని, అందుకే బిజినెస్ రూల్స్, నిబంధనలు పెట్టారని, ఇప్పుడు ఆ రూల్స్‌నే సవరిస్తే న్యాయం అనేది ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా అమలవుతుందని చెబుతున్నారు.
 
 అలాగే కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను మూడు రోజుల్లోగా అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కూడా బిజినెస్ రూల్స్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించిన తరువాత ముఖ్యమంత్రి ఆమోదానికి వెళ్తాయి.

ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం ఆయా శాఖలకు వెళితే తగిన ఆదేశాలు జారీ చేస్తాయి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే తీర్మానాలు రావడంలో జాప్యం జరుగుతోంది. ఆ జాప్యం నివారించకుండా మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేయాలంటే ప్రయోజనం ఉండదనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్సియల్ కోడ్, బడ్జెట్ మాన్యువల్ పాటించకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement