ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం
ఏపీ సీఎం దిష్టిబొమ్మ దహనం
బంజారాహిల్స్: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అక్రమ అరెస్టును నిరసిస్తూ జూబ్లీహిల్స్ డివిజన్ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గురువారం ఫిలింనగర్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కాటూరి రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మార్పీఎస్ మద్దతుతో గెలిచి ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు మాదిగలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణను విస్మరించిన చంద్రబాబు తమ అధినేత మందకృష్ణ మాదిగను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి దయ్యాల దాసు, ఉపాధ్యక్షులు నడిమింటి కృష్ణ, భవానీ రమేష్, వేణు, డి. ప్రభాకర్, పాపయ్య, కె. నర్సింహ్మ, నాగరాజు, కె.కృష్ణ, ఎన్. బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నం
ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగను అకారణంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందా కుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముట్టడికి యత్నించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో పోలీసులు వీరందరిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ట్రస్ట్‌భవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు పలువురు కార్యకర్తలు తీవ్ర యత్నాలు చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం వీరిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆందోళన చేసిన వారిలో ఎంఎస్‌ఎఫ్ జాతీయ నాయకులు లింగస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, రమేష్, రంగారెడ్డి అర్బన్ ప్రధాన కార్యదర్శి కేశవ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ, శ్రీహరి, జంగం బబ్బి, కుమ్మరి సత్యనారాయణ, ఎంఎస్‌ఎఫ్ ఓయూ అధ్యక్షుడు శేఖర్ తదితరులు ఉన్నారు.