చంద్రబాబును మించిన కులతత్వ వాది లేరు | ap congress leaders condemns Chandrababu Naidu's criticism on SCs | Sakshi
Sakshi News home page

చంద్రబాబును మించిన కులతత్వ వాది లేరు

Published Wed, Feb 10 2016 4:40 PM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM

చంద్రబాబును మించిన కులతత్వ వాది లేరు - Sakshi

చంద్రబాబును మించిన కులతత్వ వాది లేరు

హైదరాబాద్ : ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరనుకుంటారంటూ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబును మించిన కులతత్వ వాది మరొకరు లేరని ఏపీ కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. సమాజంలో పుట్టుకకు, డబ్బులకు ముడిపెడుతూ చంద్రబాబు కొత్త తరహా కపట రాజకీయాలకు తెరతీస్తున్నారని కాంగ్రెస్ నేత, శాసనమండలిలో విపక్ష నేత సి రామచంద్రయ్య, మాజీ మంత్రి శైలజానాధ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పరిపాలన పక్కన పెట్టి కులాల మాట్లాడటమేంటని తప్పుబట్టారు.

చంద్రబాబు తన మంత్రివర్గంలోగానీ, నామినేటెడ్ పదవుల్లోగానీ చివరకు పరిపాలనా పరంగా కూడా ఆయన కార్యాలయంలోగానీ కులాల వారిగా సమతుల్యత ఉందా చెప్పాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం వారు ఇందిరాభవన్ లో మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనట్లుగా విదేశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను చంద్రబాబు నియమించారని, ఆ నియామకాల్లోనూ కులతత్వాన్ని నిరూపించుకున్న ఘనత ఆయనదేనని విమర్శించారు. బీసీ వర్గాల నేత ఆర్ కృష్ణయ్యను తెలంగాణ రాష్ట్ర సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలు పూర్తి కాగానే ఆయనకు కనీస మర్యాద కూడా ఇవ్వలేని అవకాశవాద రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

కాపుల రిజర్వేషన్ల ఆందోళనకు సంఘీభావం తెలియజేయడానికి వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవిలను మీకేం పనంటూ ప్రశ్నించడంలో అర్థం లేదని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని చెబుతూ సినీనటుడు పవన్ కల్యాణ్ ను ఎందుకు దగ్గరకు తీసుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అంటూ మీడియాకు లీకులివ్వడం కాదని, ఆ విషయాలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తో అధికారికంగా చెప్పించాలని డిమాండ్ చేశారు.

కాపుగర్జన సభలో జరిగిన హింసాత్మక సంఘటనలో రాయలసీమ పాత్ర అంటూ చెప్పడంపై రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ అంశంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు దళితులకు టికెట్లు ఇస్తే ఓడిపోతారంటూ చంద్రబాబు ఆ వర్గాలపై ఉన్న తన ధ్వేషాన్ని, అగ్రవర్ణ అహంకారాన్ని చాటుకున్నారని శైలజానాధ్ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement