ఏపీ ఇంజనీరింగ్ ఫలితాలే విడుదల | AP EAMCET Engineering ranks released | Sakshi
Sakshi News home page

ఏపీ ఇంజనీరింగ్ ఫలితాలే విడుదల

Published Tue, May 10 2016 3:04 AM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

AP EAMCET Engineering ranks released

- బాలురే టాపర్లు.. టాప్ టెన్‌లో తెలంగాణ విద్యార్థులు

- 27న అడ్మిషన్ల నోటిఫికేషన్.. జూన్ 27 నుంచి తరగతులు

- సుప్రీం తీర్పుతో మెడిసిన్ ఫలితాలు నిలిపివేత 

 

సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఉత్కంఠ... సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సోమవారం రాత్రి ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం ఫలితాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మెడికల్ ఎంట్రన్స్‌కు సంబంధించిన నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఎంసెట్‌లోని ఇంజనీరింగ్ ఫలితాల వరకు మాత్రమే విడుదల చేసి.. మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలను నిలిపివేసింది. సోమవారం పొద్దుపోయాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు ఇంజనీరింగ్ ఫలితాలను విడుదల చేశారు.

 

ఈ ఫలితాలలో టాప్ టెన్ ర్యాంకుల్లో బాలుర హవా కొనసాగింది. ఇంజనీరింగ్‌లో మొత్తం 1,89,246 మంది దరఖాస్తు చేయగా అందులో 1,79,465 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 1,31,580 మంది ర్యాంకులు సాధించారు. మొత్తం హాజరైన వారిలో 81.36 శాతం మంది ఇంజనీరింగ్ ప్రవేశాలకు అర్హత పొందగా అందులో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 82.67 శాతం మంది, బాలురు 80.05 శాతం మంది అర్హత సాధించారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంకు విశాఖ జిల్లాకు చెందిన సత్తి వంశీకృష్ణారెడ్డికి దక్కగా రెండో ర్యాంకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చప్పిడి లక్ష్మీనారాయణ సాధించాడు.

ఈ ఫలితాల్లో ఏపీలోని జిల్లాల వారీగా చూస్తే.. కృష్ణా జిల్లా(78.37%) అగ్రస్థానంలో నిలవగా.. విశాఖ జిల్లా రెండో స్థానంలో ఉంది. అయితే.. హైదరాబాద్ కేంద్రంగా పరీక్ష రాసిన విద్యార్థుల్లో 88.48 శాతం మంది అర్హత సాధించడం గమనార్హం.

 

వెబ్‌సైట్లో ఓఎమ్మార్ షీట్లు

ఎంసెట్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన ఓఎమ్మార్ షీట్లను ఈనెల 17వ తేదీనుంచి 21వ తేదీవరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్‌జీ వెబ్‌సైట్లో పొందుపర్చనున్నామని సాయిబాబు తెలిపారు. వీటిపై అభ్యంతరాలుంటే పరిశీలించుకోవచ్చని, ఈనెల 25వ తేదీలోగా అభ్యంతరాలు తెలియచేయాలనుకొనే జనరల్ అభ్యర్థులు రూ. 5 వేలు, ఎస్సీఎస్టీ అభ్యర్థులు 2 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. కాగా, ఎంసెట్‌లో మెడికల్ ఫలితాలు వాయిదా వేసినా అగ్రికల్చర్ అనుబంధ సబ్జెక్ట్ ఫలితాలను ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మరోవైపు మెడికల్ పరీక్ష రాసిన వేలాది మంది అభ్యర్థులు ఫలితాలు విడుదల కాకపోవడంతో నిరాశకు గురయ్యారు.

 

ముఖ్యమైన తేదీలు..

  • మే  27న అడ్మిషన్లకు నోటిఫికేషన్
  • జూన్ 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  • జూన్ 9 నుంచి 18 వరకు ఆన్‌లైన్లో వెబ్‌ఆప్షన్ల నమోదు
  • జూన్ 22న సీట్ల కేటాయింపు
  • జూన్ 27వ తేదీనుంచి తరగతుల ప్రారంభం.

 

 ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంకర్లు

 ర్యాంక్ అభ్యర్థి                       మార్కులు

 1    సత్తి వంశీకృష్ణారెడ్డి           158

 2   చప్పిడి లక్ష్మీనారాయణ    157

 3   కొండా విఘ్నేష్ రెడ్డి         157

 4   మూల్పూరు ప్రశాంత్ రెడ్డి   156

 5   గంటా గౌతమ్               156

 6   దిగుమూర్తి చేతన్‌సాయి    155

 7   తాళ్లూరి సాయితేజ         154

 8   అబ్బే జెడ్ జార్జి              154

 9   ఎస్.ఎస్. సాయి దినేష్     154

 10  ఎన్. జైకృష్ణ సాయివినయ్  154

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement