సర్కారు గోదారి నిద్ర
ఎగువ రాష్ట్రాల ఒప్పందాలపై ఏపీ సర్కార్ మౌనముద్ర
తెలంగాణ ‘రీడిజైనింగ్’ పూర్తయితే గోదావరి డెల్టా ఎడారే
♦ రోజుకు 6.5 టీఎంసీలు తోడేస్తారు...
♦ నీటి పంపకాలు జరక్కుండానే తెలంగాణ బ్యారేజీలు..
♦ ఓటుకు కోట్లు వల్లే నిలదీయని చంద్రబాబు
♦ రాష్ర్ట ప్రయోజనాలు దెబ్బతింటున్నా గప్‌చుప్..
♦ పోలవరమే శరణ్యమంటున్న సాగునీటిరంగ నిపుణులు
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ సర్కార్ అడ్డగోలుగా ప్రాజెక్టులు చేపట్టినా నోరుమెదపని ఏపీ సర్కార్.. ఇప్పుడు గోదావరి జలాలను మళ్లించేందుకు మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నా అదేతీరున నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వచ్చి, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పూర్తయితే గోదావరి డెల్టా ఎడారిగా మారిపోతుందని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తవ్విన పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ఎత్తిపోతలతో చెంబుడు నీళ్లను కృష్ణా నదిలో కలిపి నదుల అనుసంధానం చేశానంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై అస్సలు మాట్లాడడం లేదు. రాష్ర్టం బీడుగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నా నిలదీయడం లేదు. ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినందునే ఆయన తెలంగాణ అక్రమప్రాజెక్టులపై మాట్లాడలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ, మహారాష్ట్ర ఒప్పందాలు ఇవే..
⇒ గోదావరి జలాల వినియోగం కోసం మంగళవారం మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావులు ముంబైలో ఒప్పందాలపై సంతకాలు చేశారు.
⇒ గోదావరి నదిపై 100 మీటర్ల ఎత్తులో 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర, తెలంగాణల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రాణహిత నదిపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 1.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించనున్నారు. ఈ రెండు బ్యారేజీల నుంచి రోజుకు 34,716 క్యూసెక్కుల చొప్పున 60 రోజుల్లో 180 టీఎంసీలను తరలించి.. మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటూ శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల పరిధిలోని మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టినట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
⇒ పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మించడానికి ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్ జిల్లాలో తాంసి, జైనథ్, బేల మండలాలకు నీటిని అందించనున్నారు.
అనుమతులు ఏవి?
నాసిక్‌లో జన్మించే గోదావరి నది ప్రధాన స్రవంతిపై మహారాష్ర్టలో అసంఖ్యాకంగా నిర్మించిన చిన్న, పెద్దా ప్రాజెక్టుల వల్ల తెలంగాణలోకి ప్రవేశించే సరికి ఖాళీ కుండను తలపిస్తుంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది కలిసేంత వరకూ గోదావరి నిర్జీవంగానే ఉంటుంది. ప్రాణహిత కలిసిన దగ్గర నుంచి ఆ తర్వాత ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరుల సంగమంతో అంతర్వేది వరకూ జీవకళతో గోదావరి పారుతుంది. అంటే.. ఇప్పుడు గోదావరిలో ధవళేశ్వరం వరకు ప్రవహించే జలాల్లో ఈ ఉప నదుల వాటానే ప్రధానం. ప్రాణహిత సంగమం నుంచి ధవళేశ్వరం వరకు మధ్యలో ఎక్కడా ప్రాజెక్టులు లేని కారణంగా అన్ని కాలాల్లోనూ ఈ ప్రాంతంలో గోదావరి జీవనదిలా సాగింది. రీ-డిజైనింగ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాణహిత-చేవెళ్ల’ను రూపు మార్చి కాళేశ్వరం పేరుతో ప్రాణహిత, ఇంద్రావతిల సంగమం తర్వాత మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నది.
దాని దిగువన దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, భక్త రామదాస ప్రాజెక్టులను చేపట్టింది. వర్షాకాలం వరద ఉన్న సమయం మినహా మిగతా సమయాల్లో ఈ ప్రాజెక్టులను దాటుకుని వచ్చే జలాలు ఎన్ని ఉంటాయన్నది సందేహమే. శబరి, సీలేరులే ఇక శరణ్యం. పోలవరం పూర్తయి ఉంటే.. పరిస్థితి కొంత భిన్నంగా ఉండేది. పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి, కష్ణా నదులపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా కేంద్ర జల సంఘం.. కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకున్నా తెలంగాణ సర్కారు గోదావరి నదిపై అడ్డదిడ్డంగా ప్రాజెక్టులు నిర్మించడానికి మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుంటోంది. తమకు గోదావరి జలాల్లో 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది.
రోజుకు 6.5 టీఎంసీలు తోడేస్తారు..
⇒ తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కుదిరిన ఒప్పందాలు అమల్లోకి వచ్చి.. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తయితే రోజుకు 69,248 క్యూసెక్కుల ( సుమారు 6.5టీఎంసీల) నీటిని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుంచి తోడేయనుంది.
⇒ మహారాష్ట్రలో గోదావరి పురుడు పోసుకునే నాసిక్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకూ నిర్మించిన 18 ప్రాజెక్టులు నిండాలంటే 174 టీఎంసీలు అవసరం. తెలంగాణలో శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లిలు నిండాలంటే మరో 110 టీఎంసీల నీళ్లు కావాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, చనాఖా - కొరటా బ్యారేజీలు నిండాలంటే 18.087 టీఎంసీలు నీళ్లు అవసరం.
⇒తమ్మిడిహెట్టి, మేడిగడ్డ రిజర్వాయర్‌ల నుంచి ఎత్తిపోతల ద్వారా రోజుకు 34,716 క్యూసెక్కులు, ఆ తర్వాత దేవాదుల ద్వారా 11,200 క్యూసెక్కులు, తుపాకుగూడెం ద్వారా 18,666 క్యూసెక్కులు, సీతామారామ, భక్త రామదాస ప్రాజెక్టు ద్వారా 4,666 క్యూసెక్కులు వెరసి 69,248 క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు.
గోదావరి డెల్టాకు కన్నీళ్లే..
⇒ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కురిసే వర్షాలకు ప్రస్తుతం జూన్‌లోనే వరద నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చేరుతున్నాయి. కానీ.. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయితే వరద నీళ్లు రాష్ట్రానికి చేరడం కనీసం నెల ఆలస్యమవుతుంది. గోదావరి డెల్టాలో జూన్ నుంచి నవంబర్ 15 వరకూ ఖరీఫ్, డిసెంబర్ 15 నుంచి ఏప్రిల్ వరకూ రబీ పంటలను సాగు చేస్తారు.
⇒ జూన్ నుంచి అక్టోబరు వరకూ సగటున 60 రోజులపాటూ గోదావరికి భారీ ఎత్తున వరద వస్తుంది. అక్టోబరు తర్వాత ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరుల ద్వారా గోదావరిలోకి వచ్చే నీళ్లే డెల్టాకు ఆధారం. తెలంగాణ రీడిజైనింగ్ ప్రాజెక్టులు పూర్తయితే అక్టోబర్ తర్వాత చుక్కనీరు కూడా దిగువకు వచ్చే అవకాశం లేదు. 2015, అక్టోబరు నుంచి 2016, ఏప్రిల్ వరకూ సీలేరు, బలిమెల రిజర్వాయర్లలో జల విద్యుదుత్పత్తి చేసి విడుదల చేసిన వాటితో కలిపి ధవళేశ్వరం బ్యారేజీకి సగటున ఏడు వేల క్యూసెక్కులకు మించి ప్రవాహం రాలేదు.
⇒ ఒక్క గోదావరి డెల్టాకే రబీలో కనీసం 16 వేల క్యూసెక్కుల నీళ్లు అవసరం. పుష్కర, చాగల్నాడు, వెంకటనగరం, తాడిపూడి, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలకు మరో 20 వేల క్యూసెక్కులు అవసరం. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయితే.. అక్టోబరు తర్వాత గోదావరి నుంచి చుక్క నీరు కూడా రాష్ట్రానికి చేరవు. అప్పుడు శబరి, సీలేరుల నీళ్లే ఆధారం. సీలేరు, శబరిల ద్వారా ఏడు వేల క్యూసెక్కులకు మించి లభించవు.
నీటిపంపకాలు జరక్కుండానే....
గోదావరి నదిలో మూడు వేల టీఎంసీల నీటి లభ్యత ఉందని లెక్క కట్టిన గోదావరి ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 888.90, కర్ణాటకకు 19.90, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌కు 625.46, ఒడిస్సాకు 292.46 ఆంధ్రప్రదేశ్‌కు 1,172.78 టీఎంసీల(భూపాలపట్నం విద్యుత్ కేంద్రం నీటిని పునర్వియోగంతో కలిపి 1480 టీఎంసీలు) నీటిని కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా వాటాలను ఇప్పటిదాకా తేల్చలేదు. కానీ.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం గోదావరి జలాల్లో తమ రాష్ట్రానికి 954.23 టీఎంసీల వాటా ఉందని వాదిస్తోంది. గోదావరి నదిపై ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా 433.042 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించుకుంటోంది. ప్రస్తుతం చేపట్టి..
పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా 475.797 టీఎంసీలు.. కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల ద్వారా 45.387 టీఎంసీలు వెరసి 954.236 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి వ్యూహం రచించింది. ఓటుకు కోట్లు కేసుల్లో తెలంగాణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినందునే సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ వాదనను ఖండించలేకపోతున్నారు. తెలంగాణ వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. గోదావరి జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 525.77 టీఎంసీలకే పరిమితం అవుతుంది. గోదావరి నది, ఉప నదులపై 282 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, 921 జలాశయాలు, 46 బ్యారేజీలు, 162 ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే నిర్మించారు. ఇందులో అత్యధిక ప్రాజెక్టులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్‌లలో ఉండటం గమనార్హం.
ఓటుకు కోట్లు కేసు వల్లే...
ఎలాంటి అనుమతులూ లేకపోయినా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలకడం లేదు.. పలకడం లేదు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినందువల్లే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
పోలవరమే మనకు శరణ్యం....
గోదావరి, కృష్ణా డెల్టాలకు సాగునీళ్లు అందించాలన్నా.. ఉభయగోదావరి, విశాఖపట్నం, రాజధాని జిల్లాల(కృష్ణా, గుంటూరు) ప్రజల దాహార్తి, పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చాలన్నా పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం ఒక్కటే మార్గం. రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు వరదాయిని అని కేంద్రం గుర్తించి.. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పునర్విభజన చట్టంలోనూ జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించి.. దాన్ని తామే పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ.. సీఎం చంద్రబాబునాయుడు కమిషన్‌ల కోసం ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితోనే ఎలాంటి అనుమతులు లేకున్నా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి అస్త్రంగా మారింది.
అదే సమయంలో ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అక్రమ ప్రాజెక్టులపై నిలదీయలేకపోతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెడుతున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతలపై పెట్టిన శ్రద్ధ పోలవరంపై పెట్టి ఉంటే.. ఈ పాటికి ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఓ కొలిక్కి వచ్చేవి. ఆ ప్రాజెక్టు పూర్తయితే.. 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఏడాదిలో 301 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. గోదావరికి వరదలేని కాలంలో పోలవరంలో నిల్వ చేసుకున్న నీటిని గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలకు అందించి.. పంటలను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందని సాగునీటి నిపుణులు స్పష్టీకరిస్తున్నారు.