11 నుంచి పోలీసు పోస్టులకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దాదాపు 9,281 కానిస్టేబుళ్ల పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. కొలువుల సంఖ్య భారీగా ఉండటం... వయో పరిమితి సడలింపు నేపథ్యంలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితి 25 ఏళ్లు కాగా హోంగార్డులుగా పనిచేస్తున్న వారు 33 ఏళ్లలోపు ఉంటే దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అలాగే మహిళలకు సివిల్ పోలీసులలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం...
పోలీస్ కానిస్టేబుల్ కొలువులకు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా రిజిస్ట్రేషన్ ఫీజును ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 మీసేవా, ఈసేవా, ఏపీ ఆన్‌లైన్ లలో చెల్లించి రశీదు తీసుకోవాలి. ఆతర్వాత డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ.ఇన్ వెబ్‌సైట్‌లో అప్లైఆన్‌లైన్ ను క్లిక్ చేస్తే పేమెంట్ గేమింగ్ ప్రత్యక్షమవుతుంది. అందులో రశీదు రిజిస్ట్రేషన్ నంబర్ పొందుపరచాల్సి ఉంటుంది.
ఆతర్వాత మై అప్లికేషన్‌లోకి వెళ్లి అభ్యర్థులు వారి పూర్తి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలు తలెత్తితే వెబ్‌సైట్‌లోనే 'యూజర్ గైడ్' పరిశీలించి సందేహాలు నివృతి చేసుకోవచ్చు. ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థి సెల్‌కు సంక్షిప్త సమాచారం అందుతుంది. మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు అందుతాయి. ప్రిలిమినరీ పరీక్షకు వారం ముందు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తిగా మారిన ఎంపిక విధానం..
పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం కోసం గతంలో ఉన్న విధానాలను పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా పరుగుకు స్వస్తి చెప్పడంతో సాంకేతిక మీదనే ఎక్కువ దృష్టి సారించారు. ఎంపిక విధానంలో మొట్ట మొదటగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనున్నారు. 200 మార్కుల బహుళ ఐచ్ఛిక ప్రశ్నాపత్రంతో కూడిన పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో కేటగిరీల వారీగా జనరల్ అభ్యర్థులు 40శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. ఉత్తీర్ణత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.
పరుగు పందెం సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రాణాలు కోల్పోతున్నందున 5కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ల పోటిని పక్కన పెట్టారు. పురుషుల విభాగంలో కేవలం 800 మీటర్లు, మహిళల విభాగంలో 100 మీటర్ల పరుగుకే పరిమితం చేశారు. అనంతరం ఫైనల్‌గా మరో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇది కూడా ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించి 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో లభించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు.
సిలబస్...
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి మొదటగా నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన 200 ప్రశ్నలు అబ్టెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. వీటికి సంబంధించిన సిలబస్... ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, టెస్ట్ ఆఫ్ రిజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ ఆఫ్ పర్ టెయినింగ్ టూ స్టేట్ ఆఫ్ తెలంగాణ, సంబంధించి ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షలు తర్వాత ఫైనల్‌గా మరో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో కూడా ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన 200 ప్రశ్నలు అడుగుతారు. అదనంగా పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.