ఆషాఢ బోనాలకు అంకురార్పణ
* ఘనంగా గోల్కొండ బోనాలు
* అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంరంభం ఆషాఢ బోనాలకు అంకురార్పణ జరిగింది. అశేష భక్తజనం మధ్య... మంగళ వాయిద్యాలతో గోల్కొండ కోటపై జగదాంబిక అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన గురువారం వైభవంగా సాగింది. ఉదయం 8 గంటలకు చార్మినార్ సమీపంలోని మురిగీచౌక్ నుంచి బయలుదేరిన తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన గ్రామ దేవతల ప్రదర్శన లంగర్‌హౌస్ వరకు సాగింది.
ఉదయం 11 గంటలకు కోటపై అమ్మవారికి నజర్ బోనం సమర్పించారు. రంజాన్ పండుగ కూడా కావడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. ఊరేగింపులో ఐక్యతను చాటేలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫతేదర్వాజా వద్ద మైత్రీసంఘం సభ్యులు, ముస్లింలు అమ్మవారికి పూజలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావుగౌడ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వం తరఫున అమ్మవారికి బోనాలతో పాటు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. వచ్చే నెల 4 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. గతేడాది కంటే ఈసారి మరింత ఘనంగా, ఉత్సాహంగా బోనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తలసాని చెప్పారు. రంజాన్, బోనాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ... దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాలకు సైతం నిధులను కేటాయిస్తున్నామని, గోల్కొండలో ప్రారంభమైన ఆషాఢ బోనాలు తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు నిదర్శనమన్నారు.