వచ్చేనెల 6 వరకు అసెంబ్లీ
బీఏసీ సమావేశంలో నిర్ణయం..16 రోజులు సమావేశాలు
రేపు సాధారణ బడ్జెట్ .. శుక్రవారం వ్యవసాయ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 6 తేదీ వరకు జరగనున్నారుు. 16 రోజులు సమావేశాలు జరుగుతారుు. శనివారాల్లోనూ సమావేశాలు జరగనున్నారుు. ఈ నెల 21న, 29న, ఆదివారాలు సభ జరగదు. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రభుత్వం బుధవారం సభలో ప్రవేశపెట్టనుంది. శుక్రవారం వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వచ్చే నెల 6న ద్రవ్య వినిమయ బిల్లును, ఆర్థిక సర్వే నివేదికలను సభలో ప్రవేశపెడతారు. పోలీసు శాఖలో సంస్కరణలు, మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలను రద్దు చేస్తూ జారీచేసిన మూడు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
సోమవారం శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన అసెంబ్లీలోని ఆయన చాంబర్లో నిర్వహించిన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, మంత్రి మాణిక్యాలరావు, ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీ ఎల్పీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీ ఎల్పీ ఉప నేత జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 6వ తేదీతో ముగించాలని భావిస్తున్నట్లు స్పీకర్ చెప్పారు.
కీలకాంశాలపై చర్చకు అనుమతించండి
సభలో చర్చ కోసం వైఎస్సార్ సీపీ తరఫున 19 అంశాలతో కూడిన జాబితాను జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌కు అందించారు. నిబంధనల ప్రకారం వేర్వేరు ఫార్మాట్‌ల కింద ఈ అంశాలను సభలోనే తాము లేవనెత్తవచ్చని, కానీ సభా సంప్రదాయాలను గౌరవించేందుకు బీఏసీలో ముందుగా మీ దృష్టికి తెస్తున్నామని, వీటిపై చర్చకు తగి న సమయం కేటాయించాలని జగన్ స్పీకర్‌ను కోరారు. రాష్ట్రంలో ‘స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్లు(సర్కారీ హత్యలు)’ జరుగుతున్నాయని, వీటిపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించామని, చర్చ జరగాలని స్పష్టంచేశారు. చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు కల్పించుకుంటూ ఆ మాట సరికాదని, ఉపసంహరించుకోవాలని అన్నారు.
శాంతిభద్రతలపై చర్చ చేస్తే అన్నీ తేలుతాయని, చర్చకు అవకాశమివ్వాలని అడిగారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. వేరే ఫార్మాట్‌లో వస్తే చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది కదా అని అనడంతో చర్చ అంతటితో ముగిసింది. బిజినెస్ ఏమీ లేనందున విజన్ డాక్యుమెంటుపై రెండు రోజులు చర్చ పెట్టాలని యనమల రామకృష్ణుడు ప్రతిపాదించగా సమస్యలు అనేకం ఉంటే బిజినెస్ లేదని అనడమేమిటని జగన్ ప్రశ్నించారు. వ్యవసాయ, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణ మాఫీ, శాంతిభద్రతలు, సాగునీటి ప్రాజెక్టులు, వైద్య, ఆరోగ్య పరిస్థితులు, రాజధాని ప్రాంతం ఎంపిక వంటి అంశాలతో తాము జాబితా ఇచ్చామని చెప్పారు.
బీఏసీలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి
పార్టీలకు ఉన్న సంఖ్యా బలాన్ని అనుసరించి బీఏసీలో ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నా, తమ పార్టీ నుంచి ఇద్దరికే అవకాశమివ్వడం సరికాదని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. బీఏసీలో అధికార పక్షం నుంచి అయిదుగురికి ప్రాతిని ద్యం కల్పించి, ప్రతిపక్షం నుంచి ఇద్దరికే అవకాశం కల్పిం చారని అన్నారు. స్పీకర్ కల్పించుకొని.. గతం నుంచి ప్రతి పక్షానికి రెండే స్థానాలు కేటాయిస్తున్నారని, అదే సంప్రదాయాన్ని కొనసాగించామని వివరిస్తూ ఆ జాబితాను చూపించారు. ఇప్పుడు అధికార, ప్రతిపక్షాలు రెండే ఉన్నం దున తమకు ప్రాతినిధ్యం పెంచాలని జగన్ కోరారు.