ఏటీఎంల నుంచి కోట్లు కొట్టేసి.. జల్సా చేశాడు
హైదరాబాద్: లక్షలాది రూపాయల కట్టలు చూసే సరికి దురాశ కలిగింది. నెల జీతంతో గడిపే సాధారణ జీవితంపై విసుగొచ్చి.. విలాసాల వైపు మనసు లాగింది. మద్యం, జూదాలపై వ్యామోహం కలిగింది. ఏటీఎంలలో నింపాల్సిన 1.49 కోట్ల రూపాయలను విడతల వారీగా దొంగలించాడు. మరో ఇద్దరు అతనికి సాయపడ్డారు. నాలుగు నెలల్లో కోటి రూపాయలు ఖర్చు చేసి గుర్రపు రేసులు ఆడుతూ, స్టార్ హోటల్లో విందువినోదాలతో జల్సా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.
హైదరాబాద్ మూసారంబాగ్లో ఉంటున్న సుధీర్ కుమార్ బీటెక్ ఫెయిల్ అయ్యాడు. రెండేళ్ల క్రితం క్యాష్ సర్వీస్ మేనేజ్మెంట్లో చేరాడు. ఏటీఎంలో డబ్బులు నింపడం అతని పని. నగరంలోని ఈసీఐఎల్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఎస్బీహెచ్, యునైటెడ్ బ్యాంక్ ఇండియాకు చెందిన 23 ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు నింపే బాధ్యతను సుధీర్, అశోక్ అనే మరో వ్యక్తి అప్పగించారు. కొన్నాళ్లు విధులను సక్రమంగా నిర్వహించారు. అయితే గత డిసెంబర్లో సుధీర్ డబ్బులు దొంగలించేందుకు పతకం వేశాడు. సుధీర్తో లోకేష్, మనోజ్ అనే మాజీ ఉద్యోగి చేతులు కలిపారు. వీరు కస్టమర్ల తాకిడి తక్కువగా ఉండే ఏటీఎం సెంటర్లను ఎంచుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఏటీఎం సెంటర్ల డబ్బు నింపేవారు. కొన్ని గంటల తర్వాత అవే ఏటీఎం సెంటర్లకు వెళ్లి వాళ్లకు తెలిసిన రెండో పాస్వర్డ్ సాయంతో లక్షలాది రూపాయలు కొట్టేసేవారని పోలీసులు తెలిపారు. ప్రతీ వారం ఆడిటింగ్ టీమ్ ఏటీఎం సెంటర్ల తనిఖీకి వెళ్లే ముందు.. నిందితులు డబ్బును ఏటీఎంలలో పెట్టేవారు. తనిఖీ పూర్తయిన తర్వాత మళ్లీ దొంగలించేవారు. గత నెల 18న ఇంటర్నల్ ఆడిట్ జరిగినపుడు పెద్ద మొత్తంలో డబ్బు మాయమైనట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నాచారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం దొంగత్రయాన్ని అరెస్ట్ చేశారు.
నేరం చేసినట్టు సుధీర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. దొంగిలించిన సొమ్ములో సుధీర్ 1.14 కోట్లు, అశోక్ 9.5 లక్షలు, మనోజ్ 25 లక్షలు పంచుకున్నట్టు చెప్పాడు. ప్రతీ రోజు పబ్లు, ఫైవ్ స్టార్ హోటల్లో విందులు, గుర్రపు పందేలు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడటం, కోటి రూపాయలు ఖర్చు చేశాడు. అయితే గ్యాంబ్లింగ్ ద్వారా సుధీర్ 57 లక్షలు సంపాదించాడు. పోలీసులు ఈ డబ్బును స్వాధీనం చేసుకుని సుధీర్ గ్యాంగ్ను కోర్టులో హాజరుపరిచాడు.