Sudheer Kumar
-
BRS: వరంగల్ ఎంపీ అభ్యర్థి.. ట్విస్ట్ ఇచ్చిన కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్‌కుమార్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ శుక్రవారం( ఏప్రిల్ 12)అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. వరంగల్ అభ్యర్థిని నిర్ణయించేందుకు జిల్లా నేతలతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌లో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీకి ఇటీవలే పార్టీని వీడిన స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా పిలుపు అందడంతో వరంగల్ నుంచి ఆయన పోటీ చేస్తారన్న ప్రచారం ఒక దశలో ఊపందుకుంది. చివరకు సుధీర్‌కుమార్‌ను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ నుంచి ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియ్యం కావ్య కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో బీఆర్ఎస్ తాజాగా మళ్లీ అభ్యర్థిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్కు ప్రత్యర్థులుగా ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులిద్దరూ బీఆర్ఎస్ను ఇటీవల వీడి టికెట్ తీసుకున్న వారే కావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్కు తమ పార్టీ నుంచి వెళ్లిన వారిపైనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ బీజేపీ నుంచి వర్థన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కాంగ్రెస్ నుంచి స్టేషన్ ఘన్పూర్ కడియం కావ్య బరిలో ఉన్నారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. కడియం -
పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు
సాక్షి,భీమవరం/రాజమహేంద్రవరం రూరల్/బిక్కవోలు: విశాలమైన ప్రదేశంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతిచ్చినా పట్టించుకోకుండా.. రోడ్డుపై సభ పెట్టడమే కాకుండా.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు జవహర్, నిమ్మకాయల చినరాజప్ప తదితరులపై కేసు నమోదు చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం రాజమహేంద్రవరంలోని దిశ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శుక్రవారం అనపర్తి నియోజకవర్గంలో ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దరఖాస్తు చేశారు. రోడ్డుపై సభ నిర్వహించకూడదన్న షరతులతో వారికి అనుమతులిచ్చాం. విశాలమైన ప్రదేశంలో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సభ నిర్వహించుకోవాలని సూచించాం. కానీ పోలీసుల మాటలు పట్టించుకోకుండా.. బిక్కవోలు నుంచి అనపర్తికి చంద్రబాబు, టీడీపీ నేతలు ర్యాలీగా వస్తుండటంతో ఆర్ఎస్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద డీఎస్పీ భక్తవత్సలనాయుడు వారితో షరతుల ఉల్లంఘనపై చర్చించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ మంత్రులు జవహర్, నిమ్మకాయల చినరాజప్పతో పాటు వెయ్యి మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు ప్రోద్బలంతో పోలీసులను నెట్టుకుంటూ ముందుకు దూసుకొచ్చారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. ఈ ఘటనపై డీఎస్పీ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలు వెయ్యి మందిపై బిక్కవోలు ఎస్సై బుజ్జిబాబు కేసు నమోదు చేశారు’ అని ఇన్చార్జ్ ఎస్పీ సుధీర్‌కుమార్ వివరించారు. ఇరుకైన ప్రదేశం కావడంతో అనపర్తిలో రోడ్‌షోకు మాత్రమే అనుమతిచ్చామని.. సభకు అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. గోకవరంలో చంద్రబాబు సభను అడ్డుకోలేదని తెలిపారు. కేసు విచారణ చేపట్టి సంబంధిత నేతలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సభ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు.. అనుమతులు లేని ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టబద్ధమైన చర్యలు తప్పవని ఐజీ జి.పాలరాజు చెప్పారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సభ నిర్వహణకు కళాక్షేత్రంతోపాటు బలభద్రపురం వద్ద పెద్ద లేఅవుట్‌ను సూచించి అక్కడ పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని చెప్పినా వినకుండా.. చంద్రబాబు, టీడీపీ నేతలు పోలీసులను నెట్టేసి.. రోడ్డు పైనే సభ పెట్టారని పాలరాజు తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కొందరు బస్సు అద్దాలు పగలగొట్టడంతో పాటు పోలీసులపై రాళ్లు రువ్వారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎం చంద్రబాబుకు రక్షణ కల్పించేందుకే పోలీసులు కొద్దిపాటి లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ రవిప్రకాష్, డీఎస్పీ బి.శ్రీనాథ్ పాల్గొన్నారు. -
వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) పెద్దపీట వేస్తోందని బ్యాంక్ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్‌కుమార్ జన్నావర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి రుణాలు తీసుకుని పంట కోతల అనంతర పనులకు, గిడ్డంగుల నిర్మాణాలకు వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రుణాలు వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. ఈ రంగంలో మౌలిక వసతులు ఏర్పడాలంటే దీర్ఘకాలిక రుణాలు అవసరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అదే విషయం చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఏం చేయగలుగుతుందనే దానిపై చర్చిస్తున్నాం. నాబార్డ్ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్) ఏర్పాటైంది. దీని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిధిని పంట కోతల అనంతర కార్యకలాపాలు అంటే ధాన్యం నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్‌లు, అదనపు విలువ జోడింపు గదులు వంటి వాటి కోసమే ఇస్తారు. 324 ఎఫ్‌పీవోలకు ప్రోత్సాహం... రాష్ట్రంలో ప్రస్తుతం 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవోలు) ప్రోత్సహిస్తోంది. వీటిలో 259 సంఘాలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి చాలా పురోగతిని సాధిస్తున్నాయి. ఆ సంఘాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే దశకు వచ్చాయి. వీటికి పరపతి సౌకర్యం కూడా బాగుంది. భవిష్యత్ అంతా ఎఫ్‌పీవోల పైనే ఆధారపడే పరిస్థితి రావొచ్చు. వర్షాధారిత ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. 200 వాటర్ షెడ్ పథకాలను ప్రోత్సహిస్తున్నాం. -
‘దాడులకు భయపడే బాబు తెలంగాణకు పారిపోయారు’
సాక్షి, విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి సారేపల్లి సుధీర్ కుమార్ విమర్శించారు. చుట్టగుంటలో పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు తన పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌పై జరిగిన ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడిలో బయటపడ్డ అవినీతి సొమ్ము ఎక్కడిదో చెప్పాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారని మాట్లాడిన అచ్చెం నాయుడు ఐటీ దాడులు అనేవి కేంద్రం పరిధిలో ఉంటాయన్న సంగతి కూడా తెలియకుండా ఎలా ఎమ్మెల్యే అయ్యారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ 8 నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఇమేజ్ రోజు రోజుకు డ్యామేజ్ అవుతుందని విమర్శించారు. ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్నాయని భయపడి బాబు తెలంగాణకు పారిపోయారని విమర్శించారు. టీడీపీ బినామీలను అదుపులోకి తెస్తే 10 సంవత్సరాల రాష్ట్ర బడ్జేట్ సొమ్ము బయటకు వస్తుందన్నారు. కేంద్రం స్పందించి ప్రజాధనాన్ని వెలికితీయాలని కోరారు. టీడీపీ ఎన్ని ఆరోపణలు చేసిన సీఎం జగన్‌కు ప్రజాభిమానం తగ్గదని ఆయన స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లింది.. చంద్రబాబు, లోకేశ్ పలకరేం!? -
వ్యవసాయ వర్సిటీలో ఫీజుల దందా
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఫీజు దందా మొదలుపెట్టింది. వ్యవసాయ సీట్లకు డిమాండ్ ఉందని, ఇతర రాష్ట్రాల్లోకి వెళుతున్నారన్న సాకుతో సీట్లు పెంచుతూ భారీ ఫీజులకు తెరలేపింది. వంద సీట్లు పెంచాలని, అందులో 75 సీట్లలో ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర రూపాయలు అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. దీనికి సాధారణ ఫీజులు కలుపుకుంటే కోర్సు మొత్తానికి రూ.8 లక్షలకుపైగా ఖర్చు అవుతుంది. మరో 25 సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద పరిగణించి ఒక్కోదానికి ఏడాదికి లక్షన్నర ఫీజుతోపాటు ప్రవేశ సమయంలో రూ.4.76 లక్షలు (6,800 అమెరికా డాలర్లు) అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఎన్ఆర్ఐ సీటు కోర్సు మొత్తానికి, సాధారణ ఫీజుతో కలిపి రూ.12 లక్షలకుపైగా ఖర్చు కానుందని వర్సిటీ వర్గాలు వివరించాయి. ఈ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేశారు. అకడమిక్ కౌన్సిల్ ఆమోదం... వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు అధ్యక్షతన జరి గిన వర్సిటీ 10వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం పలు తీర్మానాలు చేసిందని సుధీర్‌కుమార్ తెలిపారు. విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కళాశాలల్లో అధిక మొత్తం ఫీజులు చెల్లించి బీఎస్సీ వ్యవసాయ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఈ నేపథ్యంలో వర్సి టీలో మరో వంద సీట్లు పెంచాలని ప్రతిపాదించిన ట్లు పేర్కొన్నారు. 75 పేమెంట్ సీట్లు ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తామని, రిజర్వేషన్ విధానం పాటిస్తామని తెలిపారు. ఈ సీట్లకు సాధారణ ఫీజుతోపాటు అదనంగా ఏడాదికి రూ.లక్షా 50 వేలు, ఎన్ఆర్ఐ కోటాలోని 25 సీట్లకు సాధారణంగా కోర్సుకు చెల్లించే ఫీజుతోపాటు ఏడాదికి రూ.లక్షా 50 వేలు అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్కోర్సు సీట్లను 59 నుంచి 75కి పెం చుతూ నిర్ణయం తీసుకున్నామని, వర్సిటీ పరిధిలో ఉన్న పది ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సీట్ల సంఖ్యను 330 నుంచి 220కి తగ్గిస్తున్నామని తెలిపారు. ఈ ప్రతిపాదనల్ని వర్సిటీ కౌన్సిల్ ఆమోదించిన తరు వాత ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. -
ఏటీఎంల నుంచి కోట్లు కొట్టేసి.. జల్సా చేశాడు
హైదరాబాద్: లక్షలాది రూపాయల కట్టలు చూసే సరికి దురాశ కలిగింది. నెల జీతంతో గడిపే సాధారణ జీవితంపై విసుగొచ్చి.. విలాసాల వైపు మనసు లాగింది. మద్యం, జూదాలపై వ్యామోహం కలిగింది. ఏటీఎంలలో నింపాల్సిన 1.49 కోట్ల రూపాయలను విడతల వారీగా దొంగలించాడు. మరో ఇద్దరు అతనికి సాయపడ్డారు. నాలుగు నెలల్లో కోటి రూపాయలు ఖర్చు చేసి గుర్రపు రేసులు ఆడుతూ, స్టార్ హోటల్లో విందువినోదాలతో జల్సా చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. హైదరాబాద్ మూసారంబాగ్లో ఉంటున్న సుధీర్ కుమార్ బీటెక్ ఫెయిల్ అయ్యాడు. రెండేళ్ల క్రితం క్యాష్ సర్వీస్ మేనేజ్మెంట్లో చేరాడు. ఏటీఎంలో డబ్బులు నింపడం అతని పని. నగరంలోని ఈసీఐఎల్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఎస్బీహెచ్, యునైటెడ్ బ్యాంక్ ఇండియాకు చెందిన 23 ఏటీఎం కేంద్రాల్లో డబ్బులు నింపే బాధ్యతను సుధీర్, అశోక్ అనే మరో వ్యక్తి అప్పగించారు. కొన్నాళ్లు విధులను సక్రమంగా నిర్వహించారు. అయితే గత డిసెంబర్లో సుధీర్ డబ్బులు దొంగలించేందుకు పతకం వేశాడు. సుధీర్‌తో లోకేష్, మనోజ్ అనే మాజీ ఉద్యోగి చేతులు కలిపారు. వీరు కస్టమర్ల తాకిడి తక్కువగా ఉండే ఏటీఎం సెంటర్లను ఎంచుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఏటీఎం సెంటర్ల డబ్బు నింపేవారు. కొన్ని గంటల తర్వాత అవే ఏటీఎం సెంటర్లకు వెళ్లి వాళ్లకు తెలిసిన రెండో పాస్వర్డ్ సాయంతో లక్షలాది రూపాయలు కొట్టేసేవారని పోలీసులు తెలిపారు. ప్రతీ వారం ఆడిటింగ్ టీమ్ ఏటీఎం సెంటర్ల తనిఖీకి వెళ్లే ముందు.. నిందితులు డబ్బును ఏటీఎంలలో పెట్టేవారు. తనిఖీ పూర్తయిన తర్వాత మళ్లీ దొంగలించేవారు. గత నెల 18న ఇంటర్నల్ ఆడిట్ జరిగినపుడు పెద్ద మొత్తంలో డబ్బు మాయమైనట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నాచారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం దొంగత్రయాన్ని అరెస్ట్ చేశారు. నేరం చేసినట్టు సుధీర్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. దొంగిలించిన సొమ్ములో సుధీర్ 1.14 కోట్లు, అశోక్ 9.5 లక్షలు, మనోజ్ 25 లక్షలు పంచుకున్నట్టు చెప్పాడు. ప్రతీ రోజు పబ్‌లు, ఫైవ్ స్టార్ హోటల్లో విందులు, గుర్రపు పందేలు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడటం, కోటి రూపాయలు ఖర్చు చేశాడు. అయితే గ్యాంబ్లింగ్ ద్వారా సుధీర్ 57 లక్షలు సంపాదించాడు. పోలీసులు ఈ డబ్బును స్వాధీనం చేసుకుని సుధీర్ గ్యాంగ్‌ను కోర్టులో హాజరుపరిచాడు.