ఎటాక్... | Attack ... | Sakshi
Sakshi News home page

ఎటాక్...

Published Thu, Sep 24 2015 2:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

ఎటాక్...

ఎటాక్...

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లో పాలనాపరంగానే కాదు... వ్యాధుల పరంగానూ డివిజన్లు వేరవుతున్నాయి. ఈ ప్రాంతాలను వేరు చేసిందెవరో తెలుసా?... దోమలు. అవును... డెంగీ వ్యాప్తికి... మలేరియాకు కారణమవుతున్న దోమల విస్తృతిని బట్టి ఈ ప్రాంతాలు ‘విడిపోయాయి’. ఇదేదో మేం చెబుతున్న విషయం కాదు... అక్షరాలా అధికారులే తేల్చిన వాస్తవం. ఎండా కాలం... వానా కాలం అనే తేడా లేకుండా దోమలు మనపై దాడి చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీటి తీవ్రత ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించిన అధికారులు... డెంగీ ... మలేరియా కేసులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయో అంచనా వేశారు.  

 డెంగీకి ఎక్కువ అవకాశమున్న ప్రాంతాలు..
 మలక్‌పేట సర్కిల్‌లోని అక్బర్‌బాగ్, ఆజంపురా, తలాబ్‌చంచలం, చార్మినార్ సర్కిల్‌లోని ఫలక్‌నుమా, ఘాన్ని బజార్, ధూల్‌పేట, దూద్‌బౌలి, రాజేంద్రనగర్ సర్కిల్‌లోని రాజేంద్రనగర్, కార్వాన్ (సర్కిల్-7) పరిధిలోని దత్తాత్రేయ నగర్, మెహదీపట్నం, చింతల్‌బస్తీ, అబిడ్స్(సర్కిల్-8) పరిధిలోని జాంబాగ్, హిమాయత్ నగర్(సర్కిల్-9)లోని బర్కత్‌పురా, ఆడిక్‌మెట్, బంజారాహిల్స్(సర్కిల్-10)లోని సోమాజిగూడ, సనత్‌నగర్, శేరిలింగంపల్లి (సర్కిల్-11)లోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి (సర్కిల్-12)లోని హఫీజ్‌పేట, పటాన్‌చెరు, ఆర్‌సీపురం సర్కిల్‌లోని రామచంద్రాపురం, కూకట్‌పల్లి సర్కిల్‌లోని కూకట్‌పల్లి, అల్వాల్ సర్కిల్‌లోని అల్వాల్, మల్కాజిగిరి సర్కిల్‌లోని సఫిల్‌గూడ, సికింద్రాబాద్ సర్కిల్‌లోని బన్సీలాల్‌పేట, బేగంపేట.

 మలేరియాకు అవకాశమున్న ప్రాంతాలు..
 కాప్రా పరిధిలోని నాచారం, ఎల్‌బీనగర్ పరిధిలోని చంపాపేట, మలక్‌పేట సర్కిల్‌లోని సంతోష్ నగర్, జంగమ్మెట్, సలీంనగర్, అలియాబాద్, చార్మినార్ సర్కిల్‌లోని శాలిబండ, ధూల్‌పేట, పురానాపూల్, కిషన్‌బాగ్, రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్‌దేవ్‌పల్లి, కార్వాన్ పరిధిలోని మంగళ్‌హాట్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అబిడ్స్(సర్కిల్-8)లోని గన్‌ఫౌండ్రి, హిమాయత్‌నగర్ సర్కిల్‌లోని కాచిగూడ, గోల్నాక, విద్యానగర్, రామ్‌నగర్, భోలక్‌పూర్, దోమలగూడ, బంజారాహిల్స్ సర్కిల్‌లోని బంజారాహిల్స్, షేక్‌పేట, కూకట్‌పల్లి సర్కిల్‌లోని కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ సర్కిల్‌లోని షాపూర్‌నగర్, అల్వాల్ సర్కిల్‌లోని అల్వా ల్, మల్కాజిగిరి సర్కిల్‌లోని డిఫెన్స్ కాలనీ, సికింద్రాబాద్ సర్కిల్‌లోని బన్సీలాల్‌పేట, రామ్‌గోపాల్‌పేట.

 ....గత సంవత్సరం డెంగీ, మలేరియా కేసులు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రస్తుతం వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. దోమల నివారణకు నిత్యం మందు పిచికారీ చేయడం... ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు వినియోగిస్తున్నారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. సమీపంలో నీరు ఉన్నా... తొలగించాల్సిందిగా సూచిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున అన్ని ప్రాంతాల వారూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
 
 పాఠశాలల వద్ద స్పెషల్ డ్రైవ్..
 విద్యార్థులు దోమల బారిన పడకుండా ఉండేందుకు 718 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 2,306 ప్రైవేట్ పాఠశాలల్లో వీటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని జీహెచ్‌ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ తెలిపారు. పాఠశాలలు, పరిసరాల్లో పైరిథ్రమ్ స్ప్రే వంటివి వినియోగిస్తున్నామన్నారు. నాలాలు, డ్రెయిన్లలో పూడిక వల్ల దోమలు పెరిగే అవకాశముందన్నారు. మూసీ నది ప్రాంతంలో నివారణ చర్యలకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement