ఇతరుల ఆధార్‌తో మొబైల్‌ కనెక్షన్లు | attention..aadhar ! | Sakshi
Sakshi News home page

అ‘టెన్షన్‌’.. ఆధార్‌! 

Published Mon, Jan 22 2018 1:18 AM | Last Updated on Mon, Oct 8 2018 7:35 PM

attention..aadhar ! - Sakshi

విశిష్ట గుర్తింపు సంఖ్య భద్రత ప్రశ్నార్థకం

  ►   వివరాలు తస్కరిస్తున్న అక్రమార్కులు 
  ►   ఇష్టారాజ్యంగా దుర్వినియోగం 
  ►   ఇతరుల ఆధార్‌తో మొబైల్‌ కనెక్షన్లు 
  ►   ఢిల్లీలో ఓ మహిళ ఆధార్‌ నంబర్‌తో 
  ►   9 బోగస్‌ మొబైల్‌ కనెక్షన్లు 
  ►   ట్వీటర్‌లో పోస్టు చేయడంతో కలకలం 
  ►   వేలాదిగా స్పందించిన నెటిజన్లు 
  ►  అలా జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి: యూఐడీఏఐ 

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్‌.డి.ప్రియా.. ఢిల్లీలోని వసంత్‌కుంజ్‌లో ఉంటారామె.. తన మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు కొద్దిరోజుల కిందట ఎయిర్‌టెల్‌ స్టోర్‌కు వెళ్లింది.. కానీ అప్పటికే ఆమె ఆధార్‌తో ఏకంగా 9 మొబైల్‌ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయని అక్కడి సిబ్బంది చెప్పడంతో ప్రియా షాక్‌కు గురైంది! 

ఆధార్‌ వివరాలు ఏమాత్రం బయటకు వెళ్లే అవకాశం లేదని, అత్యంత పకడ్బందీగా పరిరక్షిస్తున్నామని కేంద్రం చెబుతున్న మాటల్లోని డొల్లతనం ఈ ఉదంతంతో మరోసారి బయటపడింది! ఆధార్‌ గోప్యతపై అనేక అనుమానాలను రేకెత్తించింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వివరిస్తూ ప్రియా తాజాగా ట్వీటర్‌లో చేసిన పోస్టు కలకలం రేపుతోంది. వాస్తవానికి ఆమె గత 18 ఏళ్ల నుంచి ఒకే మొబైల్‌ నంబర్‌ను వినియోగిస్తోంది. ఇప్పటివరకు ఆ నంబర్‌తో సహా ఏ మొబైల్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేయలేదు. తీరా ఇప్పుడు అనుసంధానం చేసేందుకు వెళ్లగా 9 కనెక్షన్లు లింక్‌ అయి ఉన్నాయని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ‘ఇది నా జీవితంలో అతిపెద్ద షాక్‌’అంటూ ఐదు రోజుల కింద ఆమె ట్వీటర్‌లో పేర్కొంది.

వేలాది మంది ఆమె ట్వీట్‌ను షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు తెరదీసింది. ఆధార్‌తో పౌరుల వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త సిమ్‌ కార్డు జారీ లేదా ఇప్పటికే వినియోగిస్తున్న మొబైల్‌ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే సమయంలో టెలికం కంపెనీలు వినియోగదారుల వేలి ముద్రల(బయోమెట్రిక్‌)ను స్కాన్‌ చేసి ఆధార్‌ డేటాతో సరిపోల్చి చూసుకుంటాయి. అయితే తాజా ఘటనలో బాధితురాలికి సంబంధించిన బయోమెట్రిక్‌ డేటాతో నిర్ధారించుకోకుండానే టెలికం కంపెనీలు ఆమె ఆధార్‌ నంబర్‌తో 9 మొబైల్‌ కనెక్షన్లు ఎలా జారీ చేశాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆధార్‌ నంబర్‌పై గరిష్టంగా 6 మొబైల్‌ కనెక్షన్లు మాత్రమే జారీ చేయాలని ట్రాయ్, డీఓటీ నిబంధనలు చెబుతుండగా.. 9 కనెక్షన్లు ఎలా జారీ అయ్యాయన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది.

అలా చేస్తే ఫిర్యాదు చేయండి

ఈ వివాదం తీవ్రం కావడంతో ఆధార్‌ కార్డులను జారీ చేస్తున్న భారతీయ విశిష్ట గుర్తింపు యాజమాన్య సంస్థ (యూఐడీఏఐ)తోపాటు ఎయిర్‌టెల్‌ స్పందించింది. బాధితురాలు ప్రియాతో ట్వీటర్‌లో సంప్రదింపులు జరిపాయి. తమ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని మొబైల్‌ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని యూఐడీఏఐ పేర్కొంది. తమ ఆధార్‌ నంబర్‌తో మొబైల్‌ కంపెనీలు మోసపూరితంగా సిమ్‌కార్డులు జారీ చేస్తే ట్రాయ్, లేదా డీఓటీలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. మరోవైపు బాధితురాలిని ‘సాక్షి’ట్వీటర్‌లో పలకరించగా.. ఈ ఘటనపై ఇంకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని వివరించింది. తనకు పూర్తి సమాచారం ఇస్తానని ఎయిర్‌టెల్‌ హామీ ఇచ్చిందని, కొద్దిరోజులు వేచి చూసి ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపింది. 

భద్రతకు ఏదీ భరోసా?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశాయి. రేషన్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతా, గ్యాస్‌ కనెక్షన్, డ్రైవింగ్‌ లైసెన్స్, ఉపకార వేతనాలు, స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఎరువులు, పాస్‌పోర్టు, సామాజిక పింఛన్లు, సంక్షేమ పథకాలు.. ఇలా ప్రతి అవసరానికి ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతిని తీసుకుంటున్నారు. అయితే వాటిని పకడ్బందీగా సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కార్యాలయాల్లో పని చేసే కొంతమంది సిబ్బంది లబ్ధిదారుల ఆధార్‌ జిరాక్స్‌ ప్రతులను తస్కరించి తమ సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని చాలాకాలంగా ఆరోపణలున్నాయి. ప్రధానంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల లబ్ధి కోసం రాష్ట్రంలో ఏటా లక్షల మంది విద్యార్థులు తమ దరఖాస్తులతో పాటు ఆధార్‌ ప్రతిని జత చేస్తున్నారు. స్కాలర్‌షిప్‌లు జారీ చేసే సంక్షేమ శాఖలు, విద్యా సంస్థల కార్యాలయాల్లో విద్యార్థుల దరఖాస్తులను కుప్పలు తెప్పలుగా పడేస్తుండడంతో వారి ఆధార్‌ గుర్తింపు ప్రమాదంలో పడింది. 

లింక్‌కు మార్చి 31 వరకు గడువు 

ప్రతి మొబైల్‌ ఫోన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియను కేంద్రం చేపట్టింది. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు తమ వినియోగదారుల మొబైల్‌ ఫోన్‌ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు వచ్చే మార్చి 31 వరకు గడువు పొడిగిస్తూ టెలికం శాఖ ట్రాయ్‌ నోటిఫికేషన్‌ జారీ చేశాయి. వినియోగదారులు టెలికాం కంపెనీ స్టోర్‌కు వెళ్లినప్పుడు తమ ఆధార్‌ నంబర్‌తో ఇంకా ఏమైనా మొబైల్‌ కనెక్షన్లు అనుసంధానమై ఉన్నాయా? అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ తమకు సంబంధం లేని మొబైల్‌ కనెక్షన్లు లింక్‌ అయి ఉంటే తక్షణమే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ట్రాయ్‌ అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

ఆధార్‌ వినియోగాన్నిఇలా తెలుసుకోవచ్చు 

https://resident.uidai.gov.in/notification-aadhaar వెబ్‌సైట్‌ లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ.. ఇప్పటివరకు ఎక్కడెక్కడ తమ ఆధార్‌ నంబర్‌ వినియోగమైందన్న సమాచారం తెలుసుకోవచ్చు. 12 అంకెల ఆధార్‌ గుర్తింపు నంబర్, సెక్యూరిటీ కోడ్‌(వెబ్‌సైట్‌లోనే ఉంటుంది)ను ఎంటర్‌ చేయగానే, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేయగానే ఆధార్‌ వినియోగ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement