సాక్షి,సిటీబ్యూరో: ఏయ్ బాబు ఇటు రా...అని పిలిచే ఆటో శనివారం నుంచి నిలిచిపోయింది. సందుల్లో, గొందుల్లో రయ్యున దూసుకెళ్లే ఈ త్రిచక్రం బంద్ పాటించడంతో నగరంలో లక్షలాది ఆటోలు రోడ్డెక్కలేదు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆటోసంఘాల జేఏసీ చేపట్టిన నిరవధిక సమ్మెతో సింహభాగం ఆటోలు బయటకు రాలేదు.
దీంతో నిత్యం కిటకిటలాడే రోడ్లు.. చాలావరకు బోసిపోయాయి. రైల్వేస్టేషన్లు, బస్టేషన్‌ల వద్ద ఆటోలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రఇబ్బందులకు గురయ్యారు. ఆటోచార్జీలను పెంచాలని, ట్రాఫిక్ చలానా పెంపు జీవోను వెంటనే రద్దు చేయాలని ఆటోసంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం అర్ధరాత్రి మొదలైన బంద్ ప్రభావం శనివారం స్పష్టంగా కనిపించింది. సుమారు లక్షా 20 వేల ఆటోల్లో 65శాతం ఆటోలు నిలిచి పోయాయి.
వీటిలో 25వేల వరకు స్కూల్ ఆటోలే ఉన్నాయి. అయితే చాలా స్కూళ్లకు సంక్రాంతి సెలవులు కావడంతో పిల్లలకు పెద్దగా ఇబ్బందులు కలుగలేదు. పాతబస్తీ,నగర శివారు ప్రాంతాలు, జనసమ్మర్ధం అధికంగా ఉండే కోఠి,అబిడ్స్,అమీర్‌పేట, పంజగుట్ట వంటి ప్రాంతాల్లో మాత్రం ఆటోలు పలుచగా తిరిగాయి. సికింద్రాబాద్,నాంపల్లి రైల్వేస్టేషన్లు, ఎంజీబీఎస్, జూబ్లీ బస్‌స్టేషన్లు తదితర ప్రాంతాల్లో మాత్రం ఆటోల జాడ కనిపించలేదు. 16 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ బంద్‌కు మద్దతివ్వగా, బీఎంఎస్‌తోపాటు మరికొన్ని సంఘాలు బంద్‌కు దూరంగా ఉన్నాయి.
నిలువుదోపిడీ: బంద్‌ను అదునుగా తీసుకున్న కొందరు ఆటోడ్రైవర్లు,సెవెన్ సీటర్ ఆటోవాలాలు, షేరింగ్ ఆటోల డ్రైవర్లు ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. మీటర్‌రీడింగ్‌తో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం వసూలు చేశారు.
నేడు కార్మిక సంఘాల రాస్తారోకో: ఆటోకార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా ప్రధానకార్మిక సంఘాలు ఆదివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో రాస్తారోకో చేపట్టనున్నాయి. ఆటోబంద్ మరింత ఉధృతం కాకముందే ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు వెంకటేశం, సత్తిరెడ్డి, తదితరులు విజ్ఞప్తి చేశారు.
ఆగిన ఆటో
Published Sun, Jan 19 2014 6:04 AM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM
Advertisement
Advertisement