![బీరు ధర రూ. 5 పెంపు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/71381674836_625x300_0.jpg.webp?itok=M9YNLjhJ)
బీరు ధర రూ. 5 పెంపు
ధరల నిర్ణాయక కమిటీ ఆమోదం
అదనంగా రూ.100 కోట్లు ఆదాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో బీరు ధరలు పెరగనున్నాయి. ఒక్కో బీరు ధర ప్రస్తుతం ఉన్నదాని కన్నా రూ.ఐదు వంతున పెంచేందుకు ధరల నిర్ణాయక కమిటీ ఆమోదం తెలిపిందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. సంబంధిత ఫైలు ప్రభుత్వానికి చేరింది.ఒక్కో బీరుపై ఐదు రూపాయల చొప్పున పెంచడంతో ఏడాదికి అదనంగా రూ. 100 కోట్లు వస్తాయని అధికారులు తెలిపారు. 2010 సంవత్సరం నుంచి బీరు ధరలు పెంచాలని తయారీ కంపెనీలు కోరుతున్నాయని, ఈ నేపథ్యంలో ఇప్పుడు ధరలు పెంచక తప్పనిసరి పరిస్థితి నెలకొందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇలా ఉండగా రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీలో బీరు, మద్యం కొరత ఏర్పడిందని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వినియోగానికి, సరఫరాకు మధ్య గత వ్యత్యాసాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలనేది ప్రభుత్వ అభిప్రాయంగా ఉందన్నారు. ప్రస్తుతం మద్యంను తెలంగాణ నుంచి, బీర్లను పాండిచ్చేరి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అవసరమైన మద్యం, బీర్లను ఉత్పత్తి చేసేందుకు వీలుగా కొత్తగా మద్యం, బీర్లు తయారీ కంపెనీలకు అనుమతించనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.