ఆగస్టు 1 నుంచి భూమ్!
- భూముల మార్కెట్ విలువల పెంపు కోసం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు
- మూడేళ్లుగా పెంపు ప్రతిపాదనలకు సర్కారు నో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భూముల మార్కెట్ విలువలను పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలను పంపింది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన పక్షంలో పెరిగిన మార్కెట్ విలువలు వచ్చే ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. వాస్తవానికి భూముల మార్కెట్ వాల్యూను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతియేటా రిజిస్ట్రేషన్ల శాఖ సమీక్షించడం ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తోంది. బహిరంగ మార్కెట్లో పెరిగిన ధరలను బట్టి రిజిస్ట్రేషన్ విలువను లెక్కిస్తారు. ఆయా ప్రాంతాల్లో అత్యధికంగా, అత్యల్పంగా ఉన్న భూముల సగటు ధరను తీసుకొని, అందులో 65 శాతాన్ని మార్కెట్ వాల్యూగా నిర్ణయిస్తారు.
గత మూడేళ్లుగా భూముల మార్కెట్ వాల్యూ పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతియేటా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతున్నా సర్కారు అందుకు సమ్మతించ లేదు. దీంతో విభజనకు (2013) ముందు ధరలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. మార్కెట్ ధరలను పున ః సమీక్షించని కారణంగా అంతగా భూమ్ లేని ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్ కంటే రిజిస్ట్రేషన్ విలువలే అధికంగా ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో పెరిగినప్పటికీ పాత మార్కెట్ విలువలే అమల్లో ఉండటం వలన సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లుతోందని రిజిస్ట్రేషన్ వర్గాలంటున్నాయి.
మార్కెట్ విలువను బట్టే పెంపు ప్రతిపాదనలు
వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ ధరలను బట్టి భూముల మార్కెట్ విలువలను పెంచే నిమిత్తం ఏప్రిల్ 1 నుంచే రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో భూమి విలువను (10 నుంచి 70 శాతం వరకు) ఎంత శాతం పెంచవచ్చో ప్రత్యేక ఫార్మాట్ ద్వారా వివరంగా తెలపాలని సబ్ రిజిష్ట్రార్లకు, జిల్లా రిజిష్ట్రార్లకు సూచించింది. అలాగే.. ధరలు పెరగకుండా తటస్థంగా ఉన్న ప్రాంతాలు, ధరలు బాగా తగ్గిన ప్రాంతాలను కూడా ఫార్మేట్‌లో పేర్కొనాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశించింది. కేవలం మార్కెట్ విలువల పెంపునకే పరిమితం కాకుండా, ధరలను తగ్గించాల్సి వస్తే, ఏ మేరకు తగ్గించాలో కూడా తెలపాలని ఉన్నతాధికారులు సూచించారు.
2003లో ఎకరం రేటు రూ. 10 వేలు ఉండే రాజధాని శివారు ప్రాంతాల్లోని భూముల ధరలను 2013కల్లా రూ. 40 లక్షల నుంచి 70 లక్షలకు అప్పటి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని కొన్ని మండలాల్లో భూముల మార్కెట్ విలువ గణనీయంగా పడిపోయినందున ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ ధరలను తగ్గించాలని, విలువ పెరిగిన ప్రాంతాల్లో ఆ మేరకు మార్కెట్ వాల్యూను కూడా పెంచాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ల ధరల పెంపు 10 నుంచి 15శాతం వరకు ఉండవచ్చని ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.