సైకిల్ ట్రిప్ 4 స్టార్టప్ | bicycle tour trip for startup compenys | Sakshi
Sakshi News home page

సైకిల్ ట్రిప్ 4 స్టార్టప్

Published Sun, Apr 3 2016 2:20 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

సైకిల్ ట్రిప్ 4 స్టార్టప్

సైకిల్ ట్రిప్ 4 స్టార్టప్

ఎన్నో వ్యక్తిగత సామాజిక ఆకాంక్షలతో యువతరం ప్రారంభిస్తున్న స్టార్టప్ కంపెనీలు తక్కువ సమయంలోనే మూతపడుతున్నాయి. ఇందుకు కారణాలెలా ఉన్నా, దేశ  భవిష్యత్తుకి ఎంతో అవసరమైన ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి, స్టార్టప్ కంపెనీల సమస్యలు అర్థం చేసుకొని వారి ఇబ్బందులు కొంతవరకైనా దూరం చేయడానికి సిటీ యువకుడు సైకిల్ టూర్ మొదలుపెట్టాడు. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యాత్ర ఏడాది పాటు కొనసాగనుంది.  - ఓ మధు

దేశంలోని ముఖ్య నగరాల్లో స్టార్టప్‌ల సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకూ పరిష్కారం చూపించే దిశగా ఈ టూర్ ప్రారంభించాడు కొండాపూర్‌లో నివసించే అక్షయ్ గుంతేటి(22). ‘ఇండియా స్టార్టప్ టూర్ ’ పేరిట సాగే ఈ సైకిల్ యాత్ర విశేషాలు అతని మాటల్లోనే...

స్టార్టప్‌కు సహాయం చేయాలని..
రెండేళ్ల కిందట డేటింగ్ యాప్ రూపొందించాలనుకున్నాను. దీనికి కేరళలోని కొచ్చి నుంచి ఒక టీం దొరికింది. అది ప్రారంభించాక, అక్కడికి వెళ్లి ఎన్‌జీఓలు, స్టార్టప్ విలేజ్ చూశాక యాప్ కన్నా..  ఔత్సాహిక వ్యాపారులకు సహాయం చాలా అవసరమనిపించింది. తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోవడం, లోన్ రాకపోవడం లాంటి చిన్న చిన్న సమస్యల వల్లే 90 శాతం స్టార్టప్స్ ఫెయిల్ అవుతుంటాయి. ఇన్వెస్టర్‌కి స్టార్టప్ కంపెనీ గురించి తెలియకపోవడం, స్టార్టప్ కంపెనీల వాళ్లకి ఇన్వెస్టర్ దొరకకపోవడం.. ఇవే బిజినెస్ ఫెయిల్యూర్‌కి ముఖ్య కారణమని అర్థమవుతోంది. అలాంటి కొన్ని స్టార్టప్స్‌కి సహాయం చేయాలని నిధియా వి రాజ్, నేను కలిసి ఇండియన్ స్టార్టప్ టూర్‌కి ప్లాన్ చేశాం.

 సమస్యల పరిష్కారమే ధ్యేయం..
దేశంలోని ఇన్వెస్టర్లు, సలహాదారులు, సిద్ధాంతకర్తలు, ప్రభుత్వ అధికారులను కలిసి స్టార్టప్స్‌పై అధ్యయనం, ఇవి విఫలమవడానికి కారణాలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు కనుక్కోవాలనే లక్ష్యంతో ఈ టూర్ ప్రారంభించాం. దీని కోసం సైకిల్ మీద 10,0020 కి.మీ ప్రయాణిస్తా. దీనిలో 40 మీటప్స్, 30 నగరాల విజిట్ ఉంటుంది. ఇప్పటికే వైజాగ్, విజయవాడ నగరాలను సందర్శించి మార్చి 30న హైదరాబాద్ వచ్చాను.

 భయం వద్దు.. అనుభవమే ముద్దు..
వెళ్లిన ప్రతి సిటీలో స్టార్టప్ మీటప్స్ నిర్వహించడం, అక్కడి అవసరాలు, అనువైన వ్యాపారాల రిపోర్ట్ తయారు చేయడం, ఇన్వెస్టర్లు ఎవరైనా, ఎక్కడి వారైనా తగిన స్టార్టప్ కంపెనీస్‌కి కనెక్ట్ చేయడం.. తదితర సేవల్ని ఉచితంగా అందిస్తున్నాం. స్టార్టప్ ఫెయిల్యూర్‌కి మరో ముఖ్యమైన కారణం లీగల్ అవేర్‌నెస్ లేకపోవడం. మీటప్ పెట్టి, లీగల్ ఎక్స్‌పర్ట్‌ని పిలిచి వారితో అవగాహన కల్పిస్తున్నాం. ఫెయిల్ అయినా సరే స్టార్టప్ కంపెనీ పెట్టి అనుభవం గడించిన వారిని నియమించుకోవడానికి పెద్ద కంపెనీలు కూడా ఇంట్రస్ట్ చూపిస్తాయి. అందుకే స్టార్టప్‌ను ప్రారంభించే విషయంలో సక్సెస్ అవుతామా? లేదా అనే భయం వ ద్దని నా సలహా. 

సైకిల్ సాగుతోందిలా...
ఇది పూర్తిగా నాన్ ప్రాఫిట్ టూర్. టూర్‌లో నా టెంట్‌లో లేదా ఆఫర్ చేసిన వాళ్ల దగ్గర ఉంటున్నాను. సైక్లింగ్ ద్వారా సేకరించిన డాటాని నా టీమ్ మేనేజ్ చేస్తుంది. చెన్నై, వెల్లూర్, బెంగళూర్, కోయంబత్తూర్, కొచ్చి, కన్యాకుమారి, కాలికట్, మంగళూర్, గోవా, పుణె, నాసిక్, రిషికేశ్, లక్నో... ఇలా 32 నగరాలు తిరిగి చివరకు బెంగళూర్ చేరుకుంటాను. నెల రోజుల పాటు అక్కడే ఉండి తయారు చేసిన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించనున్నాం. స్టార్టప్‌కి ఎవరూ చేయూతనివ్వరు. కానీ వాళ్ల ఐడియాలు బాగుంటాయి. అయితే వాళ్లకి చాలా సమస్యలుంటాయి. వాటిని పరిష్కరిస్తే వందలో 10 స్టార్టప్‌లు తప్పక మనగలుగుతాయి. యావత్ స్టార్టప్ కమ్యూనిటీ అంతా ఒకే గొడుగు కిందకు వచ్చి ఆ స్ఫూర్తిని దేశమంతా విస్తరించాలన్నదే మా విజన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement