ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్
- ఎంసీఐ కేంద్ర కార్యాలయానికి అనుసంధానం
- ఎంసీఐ ఆదేశంతో కదిలిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని.. ఉన్న కాలేజీల్లో పకడ్బందీగా కార్యరూపంలోకి తీసుకురావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణరుుంచింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్వహించిన తనిఖీల్లో సిబ్బంది కొరత.. వైద్య అధ్యాపకుల్లో కొందరి గైర్హాజరుతో ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 150 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడిన విషయం తెలిసిందే. అధ్యాపకుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంసీఐ తక్షణమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నింటిలో ‘బయోమెట్రిక్’ ప్రవేశపెట్టాలని, ఢిల్లీలోని ఎంసీఐ కేంద్ర కార్యాలయంతో వాటిని అనుసంధానం చేయాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. దీంతో ఆగమేఘాల మీద కదిలిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ.. బయోమెట్రిక్ విధానానికి ఏర్పాట్లు చేస్తోంది.
బాధ్యులపై కఠిన చర్యలు...
వైద్య అధ్యాపకులు, పారామెడికల్, నర్సులు పూర్తి స్థారుులో లేకపోవడం.. మౌలిక వసతుల లేమితో 2017-18 సంవత్సరానికి ఉస్మానియా మెడికల్ కాలేజీలో 50, నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ నిరాకరించింది. నవంబర్ 26న ఎంసీఐ తనిఖీలు నిర్వహించిన సమయంలో కొందరు వైద్య అధ్యాపకులు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిజామాబాద్‌కు వెళ్లడం, మరికొందరు సెలవు పెట్టకుండానే గైర్హాజరు కావడం.. వైద్య బోధన సిబ్బంది, రెసిడెంట్ వైద్యుల కొరత 21 శాతం ఉండటంతో ఎంసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల కోతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు పాక్షిక స్వయం ప్రతిపత్తి కల్పించాలని సర్కారు యోచిస్తోంది. ఎంబీబీఎస్ సీట్లకు కోత నేపథ్యంలో ఈ విషయమై సూచన ప్రాయంగా నిర్ణరుుంచింది. పాక్షిక స్వయం ప్రతిపత్తితో ఉద్యోగంలో చేరే వైద్య సిబ్బంది.. విరమణ పొందే వరకు అందులోనే పనిచేయాలి. బదిలీ అడిగే అవకాశం ఉండదు కాబట్టి సమస్యలు రావని సర్కారు యోచిస్తోంది.