హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ, టీడీపీ అభ్యర్థులు, తెలంగాణ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం ఉదయం నామినేషన్లు దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ టీడీపీ అభ్యర్థులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన టీడీపీ అభ్యర్థులు అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. వారి వెంట లోకేశ్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.
బీజేపీ అభ్యర్థిగా రైల్వేమంత్రి సురేష్ ప్రభు బీజేపీ కార్యాలయం నుంచి నేతలతో కలిసి ఏపీ అసెంబ్లీకి చేరుకున్నారు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయనకు మద్దతుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేశారు. బీజేపీ శాసనసభ్యులు నలుగురితోపాటు ఏపీ మంత్రులు కూడా సంతకాలు చేశారు. అంతకు ముందు బీజేపీ కార్యాలయంలో నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సురేష్ ప్రభు వెంట కేంద్రమంత్రి అశోకగజపతి రాజు, ఏపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావు, ఆంధ్రా, తెలంగాణ బీజేపీ నేతలు ఉన్నారు.
టీఆర్ఎస్ నుంచి డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నామినేషన్లు వేసేందుకు తెలంగాణ అసెంబ్లీ కార్యాలయానికి చేరుకున్నారు. వారు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు. వారివెంట మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. నేటి మధ్యాహ్నంతో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది. జూన్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3వ తేదీ గడువు ఉంది. జూన్ 11న అసెంబ్లీలో పోలింగ్ నిర్వహిస్తారు.