'మహా ఒప్పందాన్ని బీజేపీ స్వాగతిస్తోంది'
హైదరాబాద్: మహా ఒప్పందాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఎమ్మెల్యే డా.లక్ష్మణ్ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసి.. గోదావరి ఒప్పందాలపై అభినందించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. అంతరాష్ట్ర వివాదాలు కొనసాగుతున్నాయని అన్నారు. వాజ్‌పేయి కల నదుల అనుసంధానం అని.. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మరింత దృష్టి పెట్టారని అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో.. రాష్ట్రం లో ఉన్నా అది సాధ్యం కాలేదని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాల చొరవ వల్లనే ఇది సాధ్యం అయిందన్నారు. ఎట్టకేలకు బీజేపీ మహా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దాహార్తి, నీటి సమస్య పై సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
ఖ్యాతి మహారాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలను దృష్టిలో పెట్టుకున్న గొప్ప సీఎం గా ఫడ్నవీస్ నిలుస్తారని ఆయన కొనియాడారు. గోదావరి నదిపై బర్రాజ్ నిర్మాణం ఒప్పందానికి రావడం శుభపరిణామంగా అభిప్రాయపడ్డారు. ఇలా పరిష్కరిస్తే దేశం బాగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం పై త్వరితగతిన తీసుకోవాలని కోరుతున్నాం.. ఈ ప్రాజెక్టులపై కేంద్ర సహాయం కోసం బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.మహారాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ఒప్పందం చేసుకుందన్నారు.
తెలంగాణ కి సముద్రం లేదు కాబట్టి గోదావరి పై రవాణా కోసం ఈ ప్రాజెక్టులు ఉపయోగ పడే విధంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ను కోరినట్టు చెప్పారు. పార్లమెంట్ లో జల రవాణా బిల్లు పాస్ అవుతుంది.. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో జల రవాణా కు ఉపయోగపడుతుందని అన్నారు. ఇది తెలంగాణ ప్రజల కలగా లక్ష్మణ్ అభివర్ణించారు. ఖ్యాతి తమ పార్టీకే రావాలని తమకు ఆలోచన లేదు.. కాని ముందు నుండే బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు హన్స్రాజ్ ఆహిర్, బండారు దత్తాత్రేయ చొరవ వల్ల ఈ ఒప్పందాలు సాధ్యమయ్యాయని ఎమ్మెల్యే లక్ష్మణ్ తెలిపారు.