నన్ను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదు
నల్లగొండ : ‘నేను మతత్వ వాదిని కాదు.. సెక్యులర్ వాదిని.. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశా.. పార్టీలకతీతంగా పనిచేస్తున్నా.. ఎన్నికలప్పుడు పార్టీలు.. ఆ తర్వాత కార్యక్రమం అంతా కూడా అభివృద్ధి పైనే’ అని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ నాయకులు జిల్లా పర్యటనలో భాగంగా పార్లమెంట్ సమావేశాలను కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటున్నారని.. ఎంపీ గుత్తా అభివృద్ధి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ చేసిన విమర్శలపై గుత్తా ఫైర్ అయ్యారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.
జిల్లా బీజేపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. 2009 ఎన్నికల్లో తన పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారనే సంగతి విస్మరించరాదన్నారు. తన మీద మాట్లాడే వారిని ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. ఎంపీగా ఇన్నేళ్ల పదవీ కాలంలో జిల్లాకు సంబంధించినంత వరకు కోట్ల రూపాయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. 15వ లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీగా ఉండి కూడా తెలంగాణ సాధన కోసం పార్టీకి వ్యతిరేకంగా తన గొంతు వినిపించి రెండు సార్లు సస్పెండ్ అయిన సంగతి బీజేపీ నేతలుమరిచి పోరాదన్నారు. 14 మాసాల కాలంలో బీజేసీ చేసింది ఏమిటి..? మాటలు తప్ప చేతల్లేవు.. ? ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటిస్తూ దేశాభివృద్ధి గురించి పట్టించుకోవడం మానేశారన్నారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మునాసు వెంకన్న, మాజీ జెడ్పీటీసీ కొండేటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.