సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల ఆశలను వమ్ము చేసేలా కేసీఆర్ పాలన సాగుతోందని, కాంగ్రెస్ పాలనను తలపిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, పోలీసుల దౌర్జన్యం రాష్ట్రంలో కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా పది రోజుల పర్యటనలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. అంతేకాక ఆయన ఎన్‌ఆర్‌ఐలు వ్యక్త పరిచిన అభిప్రాయాలను తెలియజేశారు.
ఎన్‌ఆర్‌ఐల అభిప్రాయాలు : హైదరాబాద్‌ను విశ్వనగరం, డల్లాస్‌లా మారుస్తామన్న సీఎం కేసీఆర్ మాటలు నమ్మశక్యంగా లేవని ఎన్‌ఐఆర్‌ఐలు అభిప్రాయపడుతున్నారని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ పేరుతో, తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ చోటు కల్సిస్తున్నారని ప్రవాస భారతీయులు బలంగా భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎన్‌ఐఆర్‌ఐల సేవల అవసరమని కోరానని తెలిపారు. వారు పార్టీలోకి చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. బీజేపీలోకి వారికి చోటు కల్పిస్తామని, 2019 ఎన్నికల్లో పోటీ చేయోచ్చన్నారు. వచ్చే 15 రోజుల్లో కొంతమంది ప్రవాస భారతీయులు బీజేపీలో చేరుతారని తెలిపారు.
ప్రభుత్వానిది మొద్దు నిద్ర : కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని, ఇది అసమర్ధ ప్రభుత్వమని, తాము ఎన్ని సూచనలు చేసినా, పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తామని ఆయన చెప్పారు.
20 రోజులు అసెంబ్లీ సమావేశాలు : ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కనీసం 20 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒవైసీ చిలక పలుకులు పలుకుతున్నారని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయన్నారు. ఆ మూడేన్నరేళ్లలో తెలంగాణలో భారీ అవినీతి చోటుచేసుకుందని లక్ష్మణ్ విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment