'కేసీఆర్..దిగజారుడు రాజకీయాలు మానుకో'
సాక్షి, హైదరాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే డా.కె. లక్ష్మణ్ ఆరోపించారు. లాల్‌బహదూర్ స్టేడియంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పటిష్టతకు పోతోందని, ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించకుండా పార్టీలోకి తీసుకుంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌కు ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంటే ఐదు మందిని బరిలో పెట్టి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకుందని ప్రశ్నించారు. నైతిక విలువలు పూర్తిగా దిగజారే విధంగా వ్యవహరించడం దారుణమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలే మిగులుతాయని సీఎం స్వయంగా అనడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ కూటమి అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకం తమకుందని పేర్కొన్నారు.