ఓట్లు కొని చండీయాగాన్ని అవమానించారు
► కేసీఆర్‌పై నారాయణ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోల్‌సేల్‌గా ఓట్లను కొని సీఎం కేసీఆర్ చండీయాగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాలను అవమానించారని సీపీఐ సీనియర్ నేత కె.నారాయణ ధ్వజమెత్తారు. ఒకవైపు మహత్తర చండీయాగం చేస్తూ నిజాయితీగా ఉండకుండా, మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన బలం లేకపోయినా స్థానిక ప్రజాప్రతినిధులను లోబరుచుకుని సీట్లను గెలుచుకున్నారని మండిపడ్డారు.
శనివారం మఖ్దూంభవన్‌లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు పరిమితంగా 4 సీట్లే ఉన్నా ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవడం ఇందుకు తార్కాణమన్నారు. ఇది చండీయాగ ప్రభావం అనుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి మాత్రం ఇది తీరని అవమానమని వ్యాఖ్యానించారు. కొత్త ఏడాది సందర్భంగా పార్టీ ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లో పిల్లలు, పెద్దలతో కలసి తాను డాన్స్ చేయడాన్ని నారాయణ సమర్థించుకున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందేశాత్మకంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి తప్ప బూతుగా ఉండకూడదన్నారు.
దూరదర్శన్‌లో ఎన్నికల ప్రచారానికి అన్నిపార్టీల నాయకులను అనుమతి ఇస్తున్నట్లుగానే అన్ని ప్రైవేట్ టీవీ చానళ్లు, రేడియోల్లోనూ అనుమతించాలన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. సాక్షాత్తు సచివాలయంలోనే ఇతర పార్టీల నాయకులకు మంత్రి కేటీఆర్ టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, దీనిపై ఈసీ మందలిచ్చి వదిలిపెట్టడం సరికాదని, చర్య తీసుకోవాలన్నారు.