డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
హైదరాబాద్: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ప్రాంగణంలో శనివారం సంభవించిన పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయడ్డారు. బీడీఎల్ ప్రాంగణంలో వ్యర్థాలకు ఎం.ఎ.రజాక్ (42), వాహబ్(45), నవీన్(35), గోపాల్‌రావు(42) అనే కార్మికులు నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.
మంటలు చెలరేగడంతో సీఐఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌సింగ్‌తోపాటు ఆ నలుగురు కార్మికులు గాయపడ్డారు. అధికారులు వెంటనే వారిని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11.30కి మృతి చెందాడు. చెత్తలో పేలుడు స్వభావమున్నవస్తువులు ఉన్నందునే ప్రమాదం జరిగిందని, దీనికి బీడీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వర్కర్స్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.