బాడీ వార్న్ కెమెరాలను చూపుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
- బాడీ వార్న్ కెమెరాలను ప్రారంభించిన హోంమంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు, ప్రజల మధ్య జరిగే సంభాషణలకు ‘బాడీ వార్న్ కెమెరా’నే సాక్షి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో కలసి బాడీ వార్న్ కెమెరాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా బాడీ వార్న్ కెమెరాలను వినియోగంలోకి తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం ఈ నిఘా నిత్రాల ద్వారా తెలుస్తుందని, ఆ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోవడం సులభమవుతుందని తెలిపారు. ఈ-చలాన్ వచ్చాక ట్రాఫిక్ పోలీసులపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగిందన్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు ప్రజలు వాదనలు తగ్గించుకుని మర్యాదపూర్వకంగా వ్యవహరించేందుకు ఈ బాడీ వార్న్ కెమెరాలు ఉపయోగపడుతాయని తెలిపారు.
బాడీ వార్న్ కెమెరాలను హైదరాబాద్‌లో వాడనుండటం చరిత్రలో ఓ మైలురాయి అని మహేందర్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ పోలీసులు లేని సిగ్నళ్లు ఉండే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేంద్ర, సిట్ అండ్ క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ అంజనీ కుమార్, ఎస్‌బీ అదనపు సీపీ నాగిరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ రంగనాథన్ పాల్గొన్నారు.