
బాయ్‌ఫ్రెండ్ మాట విని మృత్యుఒడికి..
ఆత్మహత్యాయత్నం చేస్తే.. భయపడి ఇంట్లోని పెద్దలు మన ప్రేమ పెళ్లికి అంగీకరిస్తారని బాయ్‌ఫ్రెండ్ చెప్పిన మాటలు నమ్మి ఇంటర్ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది.
హైదరాబాద్: ఆత్మహత్యాయత్నం చేస్తే.. భయపడి ఇంట్లోని పెద్దలు మన ప్రేమ పెళ్లికి అంగీకరిస్తారని బాయ్‌ఫ్రెండ్ చెప్పిన మాటలు నమ్మి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం డబీర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన మెహరున్నీసా బేగం కుమార్తె అజ్రా ఫాతిమా (18) ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది.
ఇదే ప్రాంతానికి చెందిన సయ్యద్ అక్బర్ (19)ను ప్రేమించింది. కుటుంబసభ్యులు మన పెళ్లికి అంగీకరించాలంటే నువ్వు ఆత్మహత్యాయత్నం చేసినట్టు నటించాలని సూచించాడు. అతని మాటలు నమ్మిన ఫాతిమా ఈనెల 6వ తేదీ రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందింది. అంతకుముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్ అక్బర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.