పీహెచ్‌సీలకు బ్రాడ్‌బ్యాండ్ | Broadband to VHCs | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలకు బ్రాడ్‌బ్యాండ్

Published Tue, Dec 15 2015 2:01 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

పీహెచ్‌సీలకు బ్రాడ్‌బ్యాండ్ - Sakshi

పీహెచ్‌సీలకు బ్రాడ్‌బ్యాండ్

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డిజిటలైజేషన్
డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)ను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా వాటికి బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇటీవల లేఖ రాసింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలను అందుబాటులోకి తేవాలనేది సర్కారు ఉద్దేశంగా చెబుతున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్రం తెలంగాణలో 400 గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించగా, ఇప్పటికే 100 గ్రామాలకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మిగిలిన 300 గ్రామాలకూ త్వరలో బ్రాడ్‌బ్యాండ్ రానుంది. ఎటూ ఆ గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇస్తున్నందున అక్కడ పీహెచ్‌సీలుంటే వాటికీ తప్పనిసరిగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఒకవేళ బ్రాడ్‌బ్యాండ్ కల్పించే గ్రామంలో కాకుండా పక్కనే వేరే గ్రామంలో పీహెచ్‌సీ ఉంటే దానికి కూడా బ్రాడ్‌బ్యాండ్ కల్పించాలని నిర్ణయించినట్లు అధికారులు చెప్పారు.

 సుదూరంలో ఉన్న నిపుణుడి ద్వారా...
 బోధనాసుపత్రులు, ఇతర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నుంచి జిల్లాల్లో పీహెచ్‌సీలను 3జీ ఇంటర్నెట్‌తో అనుసంధానించి వైద్యసేవలు అందించాలని సర్కారు భావిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ ఉండే పీహెచ్‌సీలన్నింటికీ వీడియో కాలింగ్ సదుపాయం కల్పిస్తారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని వైద్య నిపుణుడు పీహెచ్‌సీలోని డాక్టర్‌తో నేరుగా మాట్లాడి రోగులకు సంబంధించిన వైద్య సలహాలు ఇస్తారు. వైద్య పరీక్షల నివేదికను ఈ-మెయిల్‌లో తెప్పించుకొని, మందుల జాబితానూ ఈ-మెయిల్ ద్వారా పంపుతారు. అలాగే రోగితోనూ నేరుగా వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారు. ఇప్పటికే నిమ్స్ నుంచి సింగరేణి ఆసుపత్రులకు టెలి మెడిసిన్ సదుపాయం ఉండగా, నెఫ్రాలజీ, రేడియాలజీ తదితర సేవలపై దీని ద్వారానే సింగరేణి వైద్యులకు సలహాలు ఇస్తున్నారు.

 పీహెచ్‌సీల పర్యవేక్షణ కూడా...
 రోగం ముదిరాక పీహెచ్‌సీ స్థాయిలో స్పెషలిస్టులు లేకపోవడంతో పట్టణాలు, నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో నగరాలకు వైద్య వలసలు పెరుగుతున్నాయి. దూరభారం అవడం వల్ల ప్రయాణ, వసతి ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. దీన్ని నివారించేందుకు టెలిమెడిసిన్ దోహదడుతుంది. ఉదాహరణకు అర్ధరాత్రి ఒక రోగికి గుండెపోటు వచ్చినట్లయితే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తెచ్చాక స్థానిక డాక్టర్ టెలిమెడిసిన్ ద్వారా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలోని గుండె వైద్య నిపుణుడితో సంప్రదించి వైద్యం చేసే వెసులుబాటు కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement