నేటి నుంచి క్యాబ్‌ డ్రైవర్ల ఆమరణ దీక్ష | Cab drivers from today's fast unto death | Sakshi
Sakshi News home page

నేటి నుంచి క్యాబ్‌ డ్రైవర్ల ఆమరణ దీక్ష

Published Wed, Jan 4 2017 5:25 AM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

నేటి నుంచి క్యాబ్‌ డ్రైవర్ల ఆమరణ దీక్ష

నేటి నుంచి క్యాబ్‌ డ్రైవర్ల ఆమరణ దీక్ష

తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: క్యాబ్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి.. భారీ క్యాబ్‌ ర్యాలీతో ఇందిరా పార్కుకు చేరుకుంటామని, ధర్నా చౌక్‌ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్‌ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు.

నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, ఉబెర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదన్నారు. రవాణా రంగంలోని ఆటో డ్రైవర్‌లు, ఆర్టీసీ డ్రైవర్‌లు సమ్మెకు దిగినప్పుడు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం.. క్యాబ్‌ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమని చెప్పారు. ఈ రెండు సంస్థల్లోనే 80 వేల క్యాబ్‌లు నమోదై ఉన్నాయని, ఆ క్యాబ్‌లు నడిపే తామంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లమేనని అన్నారు. బతుకుదెరువు కోసం అప్పు చేసి కార్లు కొనుగోలు చేశామని, ఓలా, ఉబెర్‌ సంస్థల మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు ఆ సంస్థలు తమను నిలువుదోపిడీ చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపా లని కోరారు.

తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిరుద్యోగులు డ్రైవింగ్‌ నేర్చుకుని ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, ఉబెర్, ఓలా సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని క్యాబ్‌ డ్రైవర్లు కోరారు. ముంబై, బెంగళూరు తర హాలో క్యాబ్‌లకు డిజిటల్‌ మీటర్లను ఏర్పాటు చేసి హేతుబద్ధమైన చార్జీల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయాణికులకు, డ్రైవర్లకు భద్రత కల్పించేలా ఎస్‌ఓఎస్‌ ఫోన్లను ఏర్పాటు చేయాలని, తద్వారా వెహికల్‌ ట్రాకింగ్‌కు అవకాశం కలుగుతుందని చెప్పారు. దీంతో పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో ప్రయాణికులకు పూర్తి భద్రతతో కూడిన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు సర్వేశ్వర్, సురేష్, రెడ్డి శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

4వ రోజూ ఆగిన క్యాబ్‌లు..
మంగళవారం నాలుగో రోజు కూడా ఉబెర్, ఓలా క్యాబ్‌లు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్‌ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారు ఆటోలు, ఇతర సంస్థలకు చెందిన క్యాబ్‌లకు అధిక మొత్తంలో సమర్పించు కోవలసి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement