
కాల్ మనీ...! ఇంతటితో ముగించండి...!!
ఇంతటితో ఈ అంశాన్ని ముగించాలని స్పీకర్‌ను కోరిన చంద్రబాబు
కాల్ మనీ-సెక్స్ రాకెట్‌పై చర్చకు వైఎస్సార్‌సీపీ డిమాండ్
ఉదయం సభ నుంచి వైఎస్సార్‌సీపీ మొత్తం సభ్యుల సస్పెన్షన్
నిరసన చెప్పినందుకు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన అధికార పక్షం
జగన్ చూపిన ఆధారాలపై స్పందించని చంద్రబాబు
జగన్ మాట్లాడుతున్న దశలోనే జోక్యం చేసుకున్న సీఎం
హైదరాబాద్ః కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై రెండోరోజు కూడా శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్షం మధ్య నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీ హోరెత్తింది. ఎప్పటిలాగే అధికార టీడీపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి కొనసాగించింది. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఈ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం సభ్యులను అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసే వరకు అంటూ సస్పెండు చేసింది. మళ్లీ మధ్యాహ్నం సమావేశమైనప్పుడు కూడా ప్రతిపక్షం కాల్ మనీ - సెక్స్ రాకెట్‌పై సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టగా, ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారంటూ అధికార పార్టీ అడ్డుతగిలింది. దాంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసనలతో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, ఆగ్రహించిన చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు ఆర్ కె. రోజాను ఏకంగా ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండు చేయించారు.
నిందితులపై నోరు విప్పని బాబు
రోజంతా నిరసనలు నినాదాల మధ్య ప్రతిపక్షం కొంత దిగొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. ఈ అంశంపై ముందుగా సీఎం ప్రకటన చేస్తామన్న అంశానికి ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి అంగీకరించారు. అయితే ఆ తర్వాత జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడినప్పుడు పలు ఆధారాలను ఫోటోలతో సహా ప్రదర్శించారు. కాల్‌మనీ వ్యవహారంలో నిందితుడు ముఖ్యమంత్రితో, ఇంటలిజెన్స్ చీఫ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఒకటికి నాలుగుసార్లు చూపించారు. ఎమ్మెల్యేతో కలిసి విదే శాలకు వెళ్లిన మరో నిందితుడు తిరిగి స్వదేశానికి రాకపోవడంలోని ఆంతర్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలను పదేపదే సభ దృష్టికి తీసుకురావడమే కాకుండా ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని జగన్ ప్రశ్నించినప్పటికీ ముఖ్యమంత్రి తన సమాధానంలో ఆ విషయాలనెక్కడా ప్రస్తావించలేదు.
సస్పెన్షన్ల పర్వం
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజునే ఇద్దరు ప్రతిపక్ష సభ్యులను సస్పెండు చేసిన ప్రభుత్వం రెండోరోజూ సస్పెన్షన్ల పర్వాన్ని కొనసాగించింది. కాల్ మనీ- సెక్స్ రాకెట్‌పై చర్చ జరగాలని పట్టుబట్టినందుకు అంబేద్కర్‌పై చర్చ ముగిసే వరకు ప్రతిపక్ష సభ్యులందరినీ సభ నుంచి సస్పెండు చేశారు. మధ్యాహ్నం వరకు ఏకపక్షంగా ప్రభుత్వం ప్రతిపాదించిన చర్చ అనంతరం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే మరోసారి కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశంపై ముందు చర్చ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు మూకుమ్మడిగా స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలియజేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంట్లో ఆర్కే రోజా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా, అది జరిగిన గంటకు సభలో అధికార పార్టీకి చెందిన ఒక సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేసి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలని ప్రతిపాదించారు. వెంటనే స్పందించిన సభా వ్యవహారాల శాఖ మంత్రి తీర్మానం ప్రతిపాదించడం, రోజాకు గానీ విపక్షానికిగానీ దానిపై వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా అదికూడా ఏడాది పాటు శాసనసభ నుంచి రోజాను సస్పెండు చేశారు.
చర్చ కోసం ప్రకటనకు అంగీకరించిన జగన్
రోజంతా కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారం అసెంబ్లీని కుదిపేయగా, దీనిపై చర్చ కోసం ప్రభుత్వం చెబుతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడానికి జగన్ అంగీకరించారు. కాల్ మనీ వ్యవహారంలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేసిందీ, ఎవరెవరిని అరెస్ట్ చేసిందీ ముఖ్యమంత్రి వివరించారు. ఈ వ్యవహారంలో ఏ పార్టీకి చెందిన వారు ఎంత మంది ఉన్నారన్న వివరాలను చెప్పారు.
ఇంతకన్నా ఆధారాలేం కావాలి
ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత మాట్లాడిన జగన్... ముద్దాయిలు ముఖ్యమంత్రి పక్కన, ఇంటలిజెన్స్ చీఫ్ పక్కన కూర్చొని ఫోటోలు దిగిన విషయాన్ని ప్రస్తావించారు. మరో నిందుతుడు టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి విదేశాలకు వెళ్లడం, ఈ వ్యవహారం తెరమీదకు రావడంతో విదేశాల నుంచి ఎమ్మెల్యే మాత్రమే తిరిగొచ్చి అతడితో వెళ్లిన ముద్దాయి రాకుండా పోవడాన్ని ప్రశ్నించారు.
జగన్ ప్రశ్నలకు సమాధానం చెప్పని బాబు
ఇలా ఫోటోలను చూపించి ఇంతకన్నా ఆధారాలేం కావాలని జగన్ ప్రశ్నించినప్పటికీ చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పలేదు. వారిపై చర్యలు తీసుకుంటామని హామీ పక్కనపెడితే అసలు వాటి ప్రస్తావన కూడా సభలో చేయలేదు. ఈ చర్చలో జగన్ మాట్లాడినంత సేపు మధ్యమధ్యలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు జోక్యం చేసుకుని జగన్‌పై విమర్శలు గుప్పించారు.
ఈ సబ్జెక్టును క్లోజ్ చేయండి అధ్యక్షా...
ఈ అంశంపై చర్చలో జగన్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ముద్దాయిలకు సంబంధించి తాను లేవనెత్తిన అంశాలను మరోసారి ప్రస్తావిస్తుండగా, ఆ దశలో ముఖ్యమంత్రి జోక్యం వాటికి సమాధానం చెప్పకపోగా... ఇంతటితో ఈ సబ్జెక్టును క్లోజ్ చేయండి... అధ్యక్షా అంటూ స్పీకర్‌ను కోరారు. అంతే అంతటితో సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు.