ఓన్లీ..ఇన్‌కమింగ్‌ | Call routing to the exchanges be able to send calls | Sakshi
Sakshi News home page

ఓన్లీ..ఇన్‌కమింగ్‌

Published Wed, Mar 29 2017 12:14 PM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

ఓన్లీ..ఇన్‌కమింగ్‌

ఓన్లీ..ఇన్‌కమింగ్‌

కాల్‌ రూటింగ్‌ ఎక్స్‌ఛేంజ్‌లు కాల్స్‌ పంపలేవు
సూత్రధారి మతీన్‌పై గతంలోనూ పలు కేసులు
హార్డ్‌డిస్క్‌ పునరుద్ధరించాకే స్పష్టత: సీసీఎస్‌ డీసీపీ



సిటీబ్యూరో: హైటెక్‌ పద్దతిలో ఇంటర్నేషనల్‌ కాల్స్‌ను వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ పద్దతిలో లోకల్‌ కాల్స్‌గా మార్చే కాల్‌ రూటింగ్‌ ఎక్స్‌ఛేంజ్‌లు ఇక్కడి కాల్స్‌ను బయటి దేశాలకు పంపలేవని (ఔట్‌ గోయింగ్‌) అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఆయా దేశాల నుంచి వచ్చే వాటికి లోకల్‌ కాల్స్‌గా మార్చి ఇక్కడి వారికి అందించగలవని (ఇన్‌కమింగ్‌) వివరిస్తున్నారు. కాల్‌ రూటింగ్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన తండ్రీకొడుకులు అహ్మద్‌ సిద్ధిఖీ, ఫహద్‌ అహ్మద్‌ సిద్ధిఖీలను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసే ఫోన్‌ కాల్‌ అక్కడి ఎక్స్‌ఛేంజి నుంచి నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్‌కు చేరతాయి.

అక్కడ నుంచి ఇంటర్నేషనల్‌ గేట్‌ వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్‌కు వచ్చి అక్కడ నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ లేదా శాటిలైట్‌ ద్వారా మన దేశానికి వస్తాయి. ఇక్కడకు చేరిన ఫోన్‌కాల్‌ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లోని ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌ల ద్వారా ఇక్కడ కాల్‌ రిసీవ్‌ చేసుకునే ఫోన్‌కు వస్తుంది. ఈ విధానం మొత్తం సెకను కన్నా తక్కువ కాలంలోనే పూర్తవుతుంది. ఈ సేవలు అందించినందుకు ఇక్కడి ఇంటర్నేషనల్‌ గేట్‌వే ఆఫ్‌ ఐఎల్‌డీ ఆపరేటర్, నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ ఆపరేటర్, బీఎస్‌ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లకు సైతం విదేశీ కాల్‌ ఆపరేటర్లు కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ మొత్తం చెల్లించకుండా తప్పించుకునేందుకు అక్కడి కాల్‌ ఆపరేటర్లే ఇక్కడ వ్యవస్థీకృత ముఠాలను ఏర్పాటు చేసుకుంటాయి. కొందరు సూత్రధారులు వివిధ ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ కాల్‌ రూటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి దందాలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి ఓ కాల్‌ విదేశాలకు వెళ్ళాలంటే కచ్చితంగా అది సర్వీస్‌ ప్రొవైడర్‌ ద్వారానే జరగాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మతీనుద్దీన్‌పై అనేక కేసులు
హబీబ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆఘాపురలో అహ్మద్‌ సిద్ధిఖీ, ఫహద్‌ అహ్మద్‌ సిద్ధిఖీలతో కాల్‌ రూటింగ్‌ ఎక్స్‌ఛేంజ్‌ను ఏర్పాటు చేయించింది రాజేంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన మతీనుద్దీన్‌ అలియాస్‌ మతీన్‌గా పోలీసులు నిర్థారించారు. ఇతను గతంలోనూ ఇలాంటి దందాలు చేసి పోలీసులకు చిక్కాడు. సీసీఎస్‌లోనూ మతీన్‌పై కాల్‌ రూటింగ్‌ ఆరోపణలతో కేసు నమోదై ఉంది. కొన్ని కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అహ్మద్‌ సిద్ధిఖీ, ఫహద్‌ అహ్మద్‌ సిద్ధిఖీ ఇంటిపై దాడులు నిర్వహించేందుకు వెళ్లగా పోలీసులు ఇంట్లోకి రాకుండా నిందితుల తరఫు వారు దాదాపు గంట సేపు ఆపారు. దీంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్థానిక పోలీసులు, బస్తీ పెద్దల సహకారంతో ఇంట్లోకి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో పాటు భారీ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈలోపు అప్రమత్తమైన నిందితులు తమ ల్యాప్‌టాప్‌తో పాటు ఓ కంప్యూటర్‌ను ధ్వంసం చేశారు. వీటి హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే కాల్స్‌ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరికి చేరాయి? అనే దానిపై స్పష్టత వస్తుందని సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి పేర్కొన్నారు. నిందితుల నుంచి 64 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో సహకరించడానికి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికం (డీఓటీ) సహకారం తీసుకుంటున్నామన్నారు.

ఆ కారణంగానే ప్రాధాన్యం...
పాక్‌ సహా ఇతర దేశాలకు చెందిన నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భారత్‌లోని సైనిక, నిఘా సంస్థల అధికారుల్ని ట్రాప్‌ చేయడానికి చూస్తుంటాయి. ఇందుకుగాను వారు వారు ‘హనీ ట్రాప్‌’ విధానం వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన అధికారులే మహిళలు, యువతులుగా ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిజంగానే యువతుల్ని రంగంలోకి దింపుతారు. కొంత పరిచయం పెరిగిన తర్వాత ఇక్కడి అధికారుల నుంచి వ్యక్తిగత సమాచారం సంగ్రహిస్తారు. ఆపై ఆ ఫొటోలను, సమాచారం చూపిస్తూ తమకు అనుకూలంగా మారాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. ఈ కాల్స్‌ చేయడానికి కాల్‌ రూటింగ్‌ విధానాన్నే వినియోగిస్తారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కొన్ని ఏజెన్సీల అధికారులకు కొన్ని రకాలైన బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. కాల్‌ బ్యాక్‌ చేసే అవకాశం లేని నేపథ్యంలో రూటింగ్‌ ద్వారానే దీనికి పాల్పడ్డారు.

అలాంటి రూటింగ్‌ కాల్స్‌ హైదరాబాద్‌ నుంచి వచ్చినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఆరా తీస్తున్న సమయంలోనే ఈ గ్యాంగ్‌ చిక్కింది. దీనికితోడు అహ్మద్‌ సిద్ధిఖీ రెండు పాస్‌పోర్ట్స్‌ కలిగి ఉండటం, ఒకదాన్ని వినియోగించి 2004లో పాకిస్థాన్‌కు వెళ్ళి రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిని లోతుగా విచారించడానికి కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement