గ్రేటర్ పరిధిలోని రవాణా శాఖలో డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల కొరత మళ్లీ మొదటకొచ్చింది. రూ.వేలల్లో ఫీజులు చెల్లించి డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైనప్పటికీ చాలా మంది వినియోగదారులకు సకాలంలో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం లేదు. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినప్పటికీ ఆర్సీలు చేతికందడం లేదు. కార్డుల తయారీ, ముద్రణకు అవసరమైన ఇంక్ రిబ్బన్ తదితర సామగ్రిని పంపిణీ చేసే కాంట్రాక్టర్ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, తరచూ కాంట్రాక్టర్లు మారుతుండడంతోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో ఆర్‌సీలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేక వాహనదారులు జరిమానా చెల్లించాల్సి వస్తోంది. ఏడాది కాలంగా ఈ పరిస్థితి నెలకొన్నా అధికారుల్లో చలనం లేకపోవడం గమనార్హం.
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్‌సీ కార్డుల జారీలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. దీంతో వాహనదారులు నానాపాట్లు పడుతున్నారు. అన్ని ఆఫీసుల్లోనూ వేల సంఖ్యలో కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్య తీవ్రంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయానికి కొద్ది మొత్తంలో స్టేషనరీ సరఫరా చేస్తూ అప్పటికప్పుడు దాటవేయడం మినహా శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు అధికారుల మధ్య సమన్వయలోపం కూడా కార్డుల కొరతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
వేల సంఖ్యలో పెండింగ్....
గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, మెహిదీపట్నం, మేడ్చల్, అత్తాపూర్, కొండాపూర్, నాగోల్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ, కూకట్‌పల్లి తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో ప్రతిరోజు సుమారు 2000 కొత్త వాహనాలు, మరో 1500 డ్రైవింగ్ లైసెన్సులకు కార్డులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 3500 నుంచి 4000 కార్డులు అవసరం. కార్డులతో పాటు వాటిపైన అక్షరాలను ప్రింట్ చేసేందుకు వినియోగించే రిబ్బన్‌కు కూడా డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదు. గతంలో 3 నెలల గరిష్ట డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని స్టేషనరీ నిల్వలలు ఉంచేవారు. దీంతో కార్డుల ప్రింటింగ్, పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. కానీ ఏడాది కాలంగా తరచుగా కార్డుల పంపిణీలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల కార్డులు ఉంటే రిబ్బన్ ఉండడం లేదు. రిబ్బన్ ఉన్న చోట కార్డుల కొరత ఉంది.
ఎందుకీ నిర్లక్ష్యం....
డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ సేవలను కోరే వినియోగదారులు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఫీజులు చెల్లిస్తారు. తాము పొందే కార్డు చార్జీలు, రవాణా అధికారులు చేసిన సేవల రుసుము, ఆ కార్డులను ఇంటికి పంపించేందుకు అయ్యే పోస్టల్ చార్జీలతో సహా అన్ని రుసుములు కలిపి ముందుగానే డబ్బులు చెల్లిస్తారు. ఆర్టీఏ పౌరసేవల కోసం స్లాట్ నమోదు చేసుకోవడంతో పాటే ఈ ఫీజుల చెల్లింపు కూడా జరిగిపోతుంది. కానీ సేవల్లో మాత్రం తీవ్రమైన జాప్యం నెలకొంటోంది. ఇందుకు అధికారుల నిర్లక్ష్యం, సమన్వయలోపమే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం డిసెంబర్‌లోనే పాతకాంట్రాక్ట్ సంస్థ గడువు ముగిసింది. తిరిగి దాని స్థానంలో కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకోలేదు. అలాగని పాతసంస్థతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే అవసరం మేరకు పాత కాంట్రాక్టర్ నుంచి తాత్కాలిక ప్రాతిపదికపైన స్టేషనరీ కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల తరచుగా కొరత తలెత్తుతోంది. ఒక్కో ఆఫీసులో సుమారు ఐదు వేల చొప్పున కార్డులు పెండింగ్‌లో ఉంటున్నాయి. వారం రోజుల్లో వినియోగదారుడికి చేరాల్సిన లైసెన్సు నెల రోజులైనా అందడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే కారణం...
రవాణాశాఖకు సంబంధించిన విధానపరమైన అంశాల్లో, పౌరసేవల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనేందుకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పటి కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఆర్థిక శాఖకు బదిలీ అయి ఏడాది గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. సీనియర్ అధికారుల్లో ఎవ్వరికీ ఆ బాధ్యతలను అప్పగించలేదు. దీంతో వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. మరోవైపు ప్రతిఫైల్‌ను ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి సెక్రెటేరియట్‌లోని రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇలా వేలాది మంది వాహన వినియోగదారులకు సంబంధించిన పౌరసేవల అమల్లోనూ నిర్లక్ష్యం చోటుచేసుకొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment