
ఎంపీ తనయుడిపై కేసు నమోదు
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అరవింద్ యాదవ్పై కేసు నమోదు అయ్యింది. కానిస్టేబుల్పై దాడి చేసిన కేసులో అతనిపై హుస్సేన్ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే రోడ్డుపై హోలీ ఆడవద్దని చెప్పినందుకు ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి చితక్కొట్టాడు. అరవింద్ యాదవ్- కామదహన్ కార్యక్రమంలో పాల్గొని ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడంతో బందోబస్తులో ఉన్న కానిస్టేబుల్ వంశీ ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించాడు.
అంతలో ఆగ్రహించిన ఎంపీ తనయుడు...కానిస్టేబుల్ వంశీపై దాడి చేశాడు. గాయాలపాలైన వంశీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని.. హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అరవింద్ యాదవ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అంజన్‌కుమార్‌యాదవ్ తన కుమారుడుని కేసులో నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అరవింద్ యాదవ్ స్నేహితులను, ఇతర అనుచరులనైనా కేసులో ఇరికించి, ప్రధాన నిందితుడైన అరవింద్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు తన పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు సమాచారం.