సాక్షి, హైదరాబాద్: చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చుంటాడు.. ప్రాణం లేదని డాక్టర్లు నిర్ధారించిన పిల్లలు మార్చురీలో కొనఊపిరితో ఉన్నట్లు గుర్తిస్తారు.. అప్పుడప్పుడూ ఇలాంటి వార్తలు మనం చూస్తుంటాం. వైద్యులు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అని విస్తుపోతూంటాం. నిజంగానే ఈ రకమైన ఘటనలకు వైద్యులే కారణమా? కాకపోవచ్చనే అంటున్నారు స్పెయిన్ శాస్త్రవేత్తలు. చాలా అరుదుగా కనిపించే క్యాటిలెప్సీ అనే పరిస్థితి దీనికి కారణమని వారు చెబుతున్నారు.
స్పెయిన్‌లో ఓ ఘటన..
కొన్ని రోజుల కింద స్పెయిన్‌లోని అస్టూరియాస్ ప్రాంతంలో గొంజాలో మోంటాయో జిమినెజ్ అనే వ్యక్తి మరణించినట్లు ముగ్గురు డాక్టర్లు నిర్ధారించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఇలా జరగడంతో పోస్ట్‌మార్టం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఒకట్రెండు గంటల్లో పోస్ట్‌మార్టం మొదలు కావాల్సి ఉండగా.. జిమినెజ్ కదిలాడు. ఆశ్చర్యపోయిన వైద్యులు నిశితంగా పరిశీలించి అతడు బతికే ఉన్నాడని నిర్ధారించుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
అరుదైన వ్యాధి..
శరీరం బిగుసుకుపోవడం.. ఊపిరి తీసుకునే, గుండె వేగం గుర్తించలేనంత తక్కువ స్థాయికి తగ్గిపోవడం.. సూదులతో గుచ్చినా స్పందన లేకపోవడం.. ఇవీ క్యాటిలెప్సీ లక్షణాలు. మూర్ఛ, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఈ లక్షణాలు కనిపించే అవకాశముంది. మానసిక వ్యాధులకు వాడే మందుల వల్ల సైడ్‌ఎఫెక్ట్‌గా కూడా ఈ పరిస్థితి తలెత్తొచ్చని వైద్యులు అంటున్నారు. క్యాటిలెప్సీ వచ్చిన వారి కీళ్లను వంచితే.. తిరిగి సాధారణ స్థితికి రావని.. అలాగే ఉండిపోతాయని చెబుతున్నారు. ఈ లక్షణాలన్నింటి ఫలితంగా వైద్యులు ఆ వ్యక్తి మరణించినట్లు (వైద్య పరిభాషలో రిగర్ మార్టిస్) భావిస్తుంటారని అంచనా.
చరిత్రలో క్యాటిలెప్సీ..
క్యాటిలెప్సీ చరిత్రలో చాలా తక్కువగా నమోదైందనే చెప్పాలి. 1539లో సెయింట్ థెరీసా ఆఫ్ అలీవా అనే మహిళ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. మొదట అలీవా కాళ్లు బిగుసుకుపోయాయి. మూడేళ్లపాటు అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడూ క్యాటిలెప్సీ తరహా లక్షణాలు ఆమెలో కనిపించేవి.
జిమినెజ్ బతికాడా?
స్పెయిన్‌లో క్యాటిలెప్సీ పరిస్థితిని ఎదుర్కొన్న జిమినెజ్ కొన్ని గంటల తర్వాత సాధారణ స్థితికి చేరుకున్నాడు. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న జిమినెజ్ కొన్ని వారాలుగా మందులు వాడకపోవడం వల్ల క్యాటిలెప్సీ వచ్చినట్లు వైద్యుల అంచనా. మళ్లీ బతికిన తర్వాత జిమినెజ్ అడిగిన మొదటి ప్రశ్న ‘మా ఆవిడ ఎక్కడ’’అని. మెదడుకు ఆక్సిజన్ అందని పరిస్థితులు కొన్ని గంటలపాటు అనుభవించిన జిమినెజ్ భార్య గురించి వాకబు చేయడం అతడి జ్ఞాపకశక్తి బాగానే ఉందనేందుకు చిహ్నమని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment