ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై సీఈసీ వేటు
♦ ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు
♦ కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం
♦ పాలేరు రిటర్నింగ్ ఆఫీసర్ కూడా తొలగింపు
సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ టీపీసీసీ చేసిన ఫిర్యాదుతో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతోపాటు పాలేరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు పడింది. వారిని ఆయా స్థానాల నుంచి తొలగించి, వేరే అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించింది. ఈ మేరకు వారిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సీఈసీ సూచనల మేరకు ఖమ్మం కలెక్టర్‌గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్‌లను నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం..
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, పలువురు రాష్ట్ర నేతలు మంగళవారం ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీని కలిశారు. ప్లీనరీ పేరిట టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సీఈసీ... జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయా స్థానాల్లో అధికారుల నియామకానికి పేర్లను సూచించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్పీగా నియమించేందుకు ఐపీఎస్‌లు వై.ప్రకాశ్‌రెడ్డి, విక్రమ్‌జిత్‌సింగ్ దుగ్గల్, రమా రాజేశ్వరిల పేర్లతో కూడిన జాబితాను, కలెక్టర్‌గా నియమించేందుకు ఐఏఎస్‌లు రాహుల్ బొజ్జా, సందీప్ సుల్తానియా, దానకిశోర్‌ల పేర్లతో జాబితాను సీఈసీకి పంపించింది.
వీరిలో సీఈసీ సూచనల మేరకు కలెక్టర్‌గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్‌లను నియమించింది. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న లోకేశ్‌కుమార్, ఎస్పీగా ఉన్న షానవాజ్ ఖాసీం, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (రైల్వేస్) సీహెచ్ గణేశ్‌లను బదిలీ చేసింది. ఖమ్మం కలెక్టర్‌గా నియామకమైన దానకిశోర్ ప్రస్తుతం మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా, జలమండలి డెరైక్టర్‌గా... ఎస్పీగా నియామకమైన రమా రాజేశ్వరి రంగారెడ్డి జిల్లా ఎస్పీగా, బి.శంకర్ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు.