నిఘా వలయం..
సాక్షి, సిటీబ్యూరో: గణతంత్ర దినోత్సవం.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి మూడంచెల భద్రత కల్పించారు. వేడుకలు జరిగే ఈ మైదానాన్ని బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేపట్టాయి. నగరంలోనూ అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించారు.
రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు, అనుమానిత ఉగ్రవాదులపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర శివార్లలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచారు.
నిఘా నీడలో పరేడ్ మైదానం..
గణతంత్ర వేడుకలు జరిగే పరేడ్ మైదానం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి తదితరులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వేడుకలకు హాజరయ్యేవారిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తర్వాతే మైదానంలోకి అనుమతిస్తారు.
గ్రౌండ్‌లోకి బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్స్‌లు తీసుకురావద్దని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. మైదానం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు పార్కింగ్ చేసే ప్రదేశాల్లో సైతం నిఘాను పెంచారు. గ్రౌండ్ చుట్టూ మొబైల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానిత వస్తువులు, కొత్త వ్యక్తులపై నిఘా పెట్టారు.
* టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద మూడు రోజులుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయా కూడళ్ల వద్ద మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
* సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. అన్ని ఠాణాల పరిధిలో మైత్రి, శాంతి కమిటీలతో ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలు సమావేశాలు నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారం వస్తుండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
* ఐటీ కారిడార్‌లో మాదాపూర్ డీసీపీ కార్తికేయ అక్కడి షాపింగ్ మాల్స్, ఐటీ కంపెనీలు, సినిమా థియేటర్ల సెక్యూరిటీ గార్డులతో కూకట్‌పల్లిలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
* నగర డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరావు, కమలాసన్‌రెడ్డి, సుధీర్‌బాబు, సత్యనారాయణ తమ జోన్ల పరిధిలో రోడ్లపై మార్చ్‌పాస్ట్ చేయించారు. ఫుట్ పెట్రోలింగ్‌ను సైతం చేపట్టారు. రద్దీ మార్కెట్ సెంటర్లలో తనిఖీలు చేశారు. కార్డన్ సర్చ్, డెకాయి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.