ఇక్కడే ఉండిపోవాలని ఉంది
తెలంగాణ టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు, కార్యకర్తల అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే పార్టీపై, తనపై విశ్వాసంతో ఏపీలో అధికారం ఇచ్చినందున ఇక్కడ ఉండిపోవడం సాధ్యం కావడం లేదన్నారు. తెలంగాణలో పార్టీకోసం ఎక్కువ సమయాన్ని కేటారుుస్తామని చెప్పారు. ఆదివారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పార్టీకి బలమైనా, బలహీనత అయినా నాయకత్వమే అని, సమన్వయం తో పనిచేయాలన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణకు సమయం కేటాయిస్తానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రాన్ని కోతులకు ఇచ్చినట్టుగా ఉందన్నారు. తొమ్మిదెకరాల్లో సీఎం కేసీఆర్ 150 గదులతో గడిని నిర్మించుకున్నారని విమర్శించారు. ఎల్.రమణ మాట్లాడుతూ.. తెలంగాణలో పార్టీ పటిష్టంగా ఉందని, చంద్రబాబు ధైర్యం ఇవ్వాలని కోరారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ నెలరోజులకు ఒక్కసారైనా తెలంగాణలో పార్టీ అభివృద్ధికి చంద్రబాబు సమయం ఇవ్వాలన్నారు.