కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టాడు
♦ మాల-మాదిగలను విడగొట్టాడు
♦ ఏపీలో ఆ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత
♦ జగన్‌ను విమర్శిస్తూ రెండేళ్లు పూర్తి చేయడం తప్ప సాధించింది లేదు
♦ ఏపీ సీఎం చంద్రబాబుపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ‘కులాల మధ్య చిచ్చుపెట్టింది చంద్రబాబు. మాల-మాదిగలను విడగొట్టిండు. కాపులు-బీసీల మధ్య చిచ్చుపెట్టిండు. కాపులను మచ్చిక చేసుకుందామని కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. అది బూమరాంగ్ అవుతుంది. ఆయన మెడకే చుట్టుకుంటుంది. కాపు కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ. వెయ్యి కోట్లు కేటాయించావ్. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు పెడతారు..? ప్రత్యేక విమానం వేసుకుని దేశ దేశాలు తిరిగి వస్తున్నా.. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి కూడా రాలేదు.
ఈ రెండేళ్లూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ైవె .ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ కాలం వెళ్లదీయడం తప్ప సాధించిన అభివృద్ధి ఏముంది’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రశ్నించారు. ఆయన శనివారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘కాపులకు ఇచ్చిన హామీలను రెండేళ్లుగా ఎందుకు నెరవేర్చలేదు..? వారు ఉద్యమబాట పట్టిన తర్వాతే బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారు. ఎక్కడ నుంచి తెస్తాడు. అందుకే ప్రజలు కూడా నమ్మడం లేదు. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులేవీ రాలేదు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ చేసే ఆరోపణలకు, వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు ఉన్నాడు’ అని వ్యాఖ్యానించారు.
కేబినెట్ దృష్టంతా జగన్‌ను టార్గెట్ చేయడంపైనే...
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను టార్గెట్ చేయడానికే చంద్రబాబు తన కేబినెట్ మొత్తాన్నీ వాడుకుంటున్నాడని, బీజేపీ నేతలనూ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ‘అమరావతిని జగన్ ఒక్కడే కాదు.. ఇతర విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. కార్యక్రమానికి దూరంగా ఉన్నాయి. అమరావతి పేరు పెట్టగానే దేశం అంతా ఉలిక్కి పడిందని చెప్పుకుంటున్నావ్. పక్కన ఉన్న తమిళనాడు వాళ్లకే అమరావతి గురించి తెలియదు. ఇటీవల సీమాంధ్రకు చెందిన ఓ మిత్రుడి ఫంక్షన్‌కు వెళ్లా.. అక్కడి ప్రజల్లో చంద్రబాబు పాలనపై విపరీతమైన వ్యతిరేకత ఉందని చెప్పారు. మీడియాలో వచ్చేది చూసి అంతా బాగుందని నమ్మొద్దని కూడా అన్నారు. అనుకూల మీడియాతో చంద్రబాబు మేనేజ్ చేసుకుంటున్నారని అక్కడి వారు అన్నారు’ అని తలసాని పేర్కొన్నారు. ‘రావెల కిశోర్ కొడుకు ఘటనకు జగన్‌కు ఏం సంబంధం..? ఆ కేసు జగన్ కుట్ర అంటే ఎలా..? భూమన కరుణాకర్‌రెడ్డి ముద్రగడతో ఫోన్లో మాట్లాడితే తుని విధ్వంసం జరిగిందంటారు..? ఆరోజు ఏం జరిగిందో అందరికీ తెలుసుగా, 2018కల్లా పోలవరం పూర్తి చేస్తానని ప్రగల్బాలు పలికే చంద్రబాబు బడ్జెట్‌లో ఎందుకు అంత తక్కువ నిధులు కేటాయించారు? అరకొర నిధులతో పోలవరం ఎలా పూర్తి చేస్తావ్’ అని నిలదీశారు.
సీట్ల కేటాయింపుపై రాద్ధాంతం ఎందుకు?
‘29 రాష్ట్రాలు ఉన్న దేశంలో 2 రాష్ట్రాల్లో ఉన్న పార్టీ జాతీయ పార్టీ. అయితే టీడీపీ ఇప్పుడొక రాష్ట్రంలో లేకుండా పోయింది’ అని తలసాని అన్నారు. ‘అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై రాద్ధాంతం ఎందుకు? 1996లో ఎన్టీఆర్‌ను గద్దెదింపినప్పుడు ఎన్టీఆర్ టీడీపీ వాళ్లకు ఎలా సీట్లు కేటాయించారో... ఇప్పుడూ అలాగే. మాకు మార్గం వేసింది నువ్వే కదా..’ అని చంద్రబాబునాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.