
ఇంజనీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
- సొంతలాభం కోసమే నిపుణులపై బురదజల్లుడు
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీర్లను అసమర్థులని హేళన చేస్తూ.. బ్రిటిష్ వారిని పొగడటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు వాళ్లను కించపరచడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బాటలు వేసుకునే కుట్రలో భాగంగానే.. ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చేందుకు ఇతర దేశాల వాళ్లను పొగుడుతూ మనవాళ్లను అవమానిస్తున్నారని విమర్శించారు.
విదేశీ సంస్థలను నెత్తిన పెట్టుకొని, స్వదేశీయులను కించపరిచే చంద్రబాబు పరిపాలకుడిగా అనర్హుడని మండిపడ్డారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కేఎల్ రావు లాంటి ఎంతో మంది ఖ్యాతి గడించిన భారతీయ ఇంజనీర్లను అవహేళన చేయడం దుస్సాహసమేనని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దేశంలోనే గొప్ప ఇంజినీర్లందరూ మన తెలుగు గడ్డపై పుట్టిన విషయం, ముఖ్యంగా అమెరికాలోని నాసాలో కూడా 36 శాతం భారతీయులేనన్నది తెలియదా అని ప్రశ్నించారు.