
ముఖం చాటేస్తున్న ‘చంద్రబాబు’
తెలుగుదేశం పార్టీలో తెలంగాణ తమ్ముళ్ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఏ క్షణాన ‘ఓటుకు కోట్లు’ కేసు రచ్చ రచ్చ అయ్యిందో.. అప్పటి నుంచి అధినేత చంద్రబాబు నాయుడు తీరు పూర్తిగా మారిపోయిందని వీరు మథనపడుతున్నారు. మొదటి నుంచీ పార్టీలో తెలంగాణ నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యమే ఉండేదట. అధినేత వద్ద తమకున్న ‘వెయిట్’ చూసుకుని మురిసిపోయిన నేతలు ఇప్పుడు తెల్లమొహాలు వేస్తున్నారట.
ఓటుకు కోట్లు కేసుతో పార్టీ పరువు బజార్నపడడమే కాకుండా, ఏకంగా పార్టీ అధ్యక్షుడినైనా తన పేరు తెరపైకి రావడంతో జాతీయ స్థాయిలోనూ ఇమేజీ డామేజీ అయ్యిందని చంద్రబాబు కినుక వహించారట. ఇక అప్పటి నుంచి తెలంగాణ టీడీపీ నేతలతో ఎడమొహం.. పెడమొహంగానే ఉంటున్నారట. హైదరాబాద్‌లో ఉండడానికి అధినేత జంకడంతో ప్రతీసారి ఆయనను కలవడానికి, భేటీలు జరపడానికి విజయవాడకు వెళుతున్నారు. అయితే గతంలో మాదిరిగా తెలంగాణ నేతలకు రెడ్‌కార్పెట్ స్వాగతం లేకపోగా, ఎందుకొచ్చార్రా బాబూ అన్నట్లుగా ముఖం చాటేస్తున్నారట చంద్రబాబు. ‘ఏదన్నా కష్ట సుఖం చెప్పుకుందామని మా నేతను కలవాలంటే తల ప్రాణం తోకకు వస్తోంది. ఇంతకు ముందులా రీసీవింగ్ లేదు. లేని సీటు కోసం ప్రయత్నించి పరువు తీశారన్న కోపం ఉన్నట్టుంది. విజయవాడకు పోయిన ప్రతిసారీ ఆయన అపాయింట్‌మెంటేమీ దొరకడం లేదు. బిజీగా .. ఉన్నా, మళ్లీ రండన్న సమాధానం షరా మామూలైపోయింది..’ అని టీ టీడీపీ నేత ఒకరు అసలు విషయం బయటపెట్టారు. హైదరాబాద్‌లో ఉండడానికి చంద్రబాబే కాదు ఆ .. చినబాబు కూడా జంకుతున్నారని, అందుకే ముఖం చాటేస్తున్నారని టీడీపీలో ఒకటే గుసగుసలు ..!