కాలేజీల్లో తనిఖీలకు ఓకే | Check out okay for colleges | Sakshi
Sakshi News home page

కాలేజీల్లో తనిఖీలకు ఓకే

Published Sat, Apr 30 2016 2:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

కాలేజీల్లో తనిఖీలకు ఓకే - Sakshi

కాలేజీల్లో తనిఖీలకు ఓకే

♦ విద్యా శాఖ అధికారులతోనే తనిఖీలు చేయండి
♦ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
♦ పోలీసు బృందాలను అనుమతించే ప్రసక్తే లేదు
♦ తనిఖీలు చేపట్టాల్సింది విద్యాశాఖే
♦ అంత నమ్మకం లేనప్పుడు ఆ శాఖను మూసేయండి
♦ విద్యాశాఖ అధికారులకు సాయంగా
♦ విజిలెన్స్ పోలీసులు ఉండొచ్చు
♦ కానీ వారు సివిల్ దుస్తుల్లోనే వెళ్లాలని స్పష్టీకరణ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందుకుంటున్న అన్ని కాలేజీల్లో తనిఖీలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే విద్యా శాఖ అధికారులు మాత్రమే తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది. తనిఖీలకు పోలీసు బృందాలను అనుమతించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. తనిఖీల బాధ్యతలను పోలీసులకు అప్పజెప్పడం ద్వారా మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. కాలేజీల్లో తనిఖీల బాధ్యతను విద్యాశాఖకు అప్పగించింది.

అయితే తనిఖీలకు వెళ్లే సమయంలో వారికి సహాయకులుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు చెందిన ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉండాలని.. వారు యూనిఫాంలో కాకుండా సివిల్ దుస్తుల్లో వెళ్లాలని సూచించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను జూన్ 16కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీల పేరుతో చర్యలు తీసుకునే అవకాశముందని, ఈ విషయంలో తగిన ఉత్తర్వులు ఇవ్వాలన్న కాలేజీల అభ్యర్థనను తోసిపుచ్చారు.

 సుపరిపాలనలో భాగంగానే..
 కాలేజీల్లో పోలీసుల తనిఖీల నిమిత్తం ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ భవిత డిగ్రీ కాలేజీ, ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజీ, మరో ఎనిమిది కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం విచారించారు. తొలుత ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల విషయంలో కాలేజీల్లో భారీగా అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయని కోర్టుకు నివేదించారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు, స్కాలర్‌షిప్‌లు అందాల్సిన అవసరముందని... అందులో భాగంగానే కాలేజీల్లో తనిఖీలకు పోలీసులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. సుపరిపాలనలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని పేర్కొన్నారు.

 ఏం చేస్తున్నారో అర్థమవుతోందా?
 ఏఏజీ వాదనల్లో కల్పించుకుంటూ న్యాయమూర్తి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా, ఎక్కడికెళుతున్నారు? తనిఖీలకు డీజీపీ, కమిషనర్లు, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఎందుకు, మీ విద్యాశాఖపై మీకు నమ్మకం లేదా? నమ్మకం లేనప్పుడు దాన్ని మూసేయండి. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. అసలు తనిఖీలకు పోలీసులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడుందో చెప్పండి. గుడ్ గవర్నెన్స్ మంచిదే. కాని దాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు చేస్తామంటే ఎలా?..’’ అని మండిపడ్డారు.

దీనితో ఏఏజీ స్పందిస్తూ... కాలేజీలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయని, తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా, బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆరోపించారు. దీంతో అక్రమాలకు పాల్పడే కాలేజీలపై చర్యలు తీసుకోవద్దని ఎవరూ చెప్పడం లేదని, చర్యల పేరుతో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తామంటే ఎలాగని న్యాయమూర్తి ప్రశ్నించారు. పోలీసులు కాలేజీలకు వెళ్లి ఏం చేస్తారని... అసలు మీరిలా దాడిచేసే పద్ధతిలో ఎందుకెళుతున్నారని నిలదీశారు. ఇది ఎంత మాత్రం సుపరిపాలన కాదని, మీరు ఏం చేయకూడదో అదే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తనిఖీల బాధ్యతల నుంచి పోలీసులను తప్పిస్తూ... విద్యాశాఖకు అప్పగించారు. తనిఖీలకు వెళ్లే సమయంలో విద్యాశాఖ అధికారులకు సహాయంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖకు చెందిన ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు సివిల్ దుస్తుల్లో వెళ్లాలని ఆదేశించారు.

 రెండేళ్ల రికార్డులే చూడండి
 అయితే తనిఖీల పేరుతో అధికారులు పాత రికార్డులన్నింటినీ తవ్వి తీస్తారని, దానివల్ల అనేక సమస్యలు వస్తాయని కాలేజీల తరఫు న్యాయవాదులు ఎస్.నిరంజన్‌రెడ్డి, శ్రీరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గత ఏడాది, ఈ విద్యా సంవత్సరాలకు సంబంధించిన రికార్డులను మాత్రమే పరిశీలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇక తనిఖీల అనంతరం ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశముందని, ఈ విషయంలో తగిన ఉత్తర్వులివ్వాలని కాలేజీల న్యాయవాదులు కోరగా... అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ముందు తనిఖీలు జరగనివ్వాలని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటే కోర్టు దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. విచారణను జూన్ 16కు వాయిదా వేశారు.
 
 సర్కార్ అప్పీలు.. ధర్మాసనం ఆగ్రహం
 కాలేజీల్లో తనిఖీలకు సంబంధించి శుక్రవారం ఉదయం కొంత హైడ్రామా నడిచింది. రెండు రోజులపాటు తనిఖీలు నిలిపేస్తామన్న హామీని నమోదు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన డాకెట్ ఆర్డర్‌పై ప్రభుత్వం ఉదయమే తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పీలు చేసింది. ఆ అప్పీలును పరిశీలించిన ధర్మాసనం... తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని, కేవలం ప్రభుత్వ హామీని నమోదు చేశారని గుర్తు చేసింది. అప్పీలుకు విచారణార్హతే లేదని స్పష్టం చేసింది. దీనికి అదనపు ఏజీ రామచంద్రరావు స్పందిస్తూ.. సింగిల్ జడ్జి డాకెట్ ఆర్డర్ ఉందని, తనిఖీలు వద్దని చెప్పారని వివరించారు.

ఈ వాదనను ధర్మాసనం అంగీకరించలేదు. ఉత్తర్వులు లేకుండా అప్పీలు సరికాదని, ఏమున్నా సింగిల్ జడ్జి వద్దకే వెళ్లి చెప్పుకోవాలని సూచించింది. దీంతో రామచంద్రరావు తిరిగి సింగిల్ జడ్జి వద్దకు వచ్చి ధర్మాసనం ముందు జరిగింది చెప్పారు. ప్రభుత్వ తీరుపై సింగిల్ జడ్జి కూడా విస్మయం వ్యక్తం చేశారు. ‘గురువారం మీరు ఏం చెప్పారో అది రికార్డ్ చేశాను. అంతే తప్ప ఎటువంటి ఉత్తర్వులివ్వలేదు. అలాంట ప్పుడు అప్పీలుకు ఎలా వెళతారు. ఇది సరి కాదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కాలేజీల పిటిషన్లపై విచారణ చేపట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement