సీసీ కెమెరాలున్న స్కూళ్లలోనే టెన్త్ పరీక్షలు!
- కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
- కెమెరాలు లేని స్కూళ్ల విషయంలో తర్జన భర్జన
సాక్షి, హైదరాబాద్: వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా సీసీ కెమెరాల నిఘా నీడన పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో... సీసీ కెమెరాలు ఉన్న స్కూళ్లలో పది పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అవసరమైతే మరికొన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో పదితోపాటు ఇంటర్ పరీక్షల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుపై తర్జనభర్జన పడుతోంది. ఆర్థిక భారంతో కూడుకొని ఉండడంతోపాటు ప్రైవేటు కేంద్రాల్లో ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై స్పష్టత లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకులాలు, మోడల్ స్కూళ్లన్నింటిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో వాటిలో టెన్త్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోం ది. ఇవీ పూర్తిగా సరిపోనందున మరో ఆరేడు వందల పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం మేరకు ముందుకు సాగాలని నిర్ణయించింది. ఒకవేళ కోర్టు సీసీ కెమెరాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిస్తే.. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. ఇంటర్ పరీక్షలకు సీసీ కెమెరాల ఏర్పాటు ను విద్యాశాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో సీసీ కెమెరాలున్నా.. అవి ప్రిన్సిపాల్, స్టాఫ్, కార్యాలయ గదుల్లోనే ఉన్నాయి. తరగతి గదుల్లో ఏర్పాటు చేయలేదు. ఇంటర్ పరీక్షలు ఎక్కువగా ప్రైవేటు కాలేజీలపైనే ఆధార పడాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయమే కీలకం కానుంది.