ప్రతి కేంద్రంలో సీసీ కెమెరా
టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రాక్టికల్ పరీక్షలపైనా నిఘా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగనున్న ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలకు విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతోంది. వచ్చే నెల 3 నుంచి 22 వరకు జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను కూడా నిఘా నీడన నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ప్రాక్టికల్ పరీక్షలకు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి ప్రాక్టికల్ కేంద్రంలోని ఒక్కో గదిలో రెండు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రాక్టికల్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్లో పర్యవేక్షించడంతో పాటు ప్రశ్నపత్రం పంపిణీ, మూల్యాంక నం, మార్కుల కేటాయింపు అంశాలను ఆన్‌లైన్‌లోనే చేసేలా ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాల అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తోంది. ఎగ్జామినర్లతో ప్రైవేటు యాజమాన్యాలు కుమ్మక్కై విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేయించుకునే అవకాశం లేకుండా, ఎగ్జామినర్లకు అరగంట ముందే ఆన్‌లైన్ ద్వారా పేపర్ పంపించడం, పరీక్ష పూర్తయ్యాక 2 గంటల్లోపే మార్కులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేలా చర్యలు చేపట్టింది.
ఆన్‌లైన్ ప్రశ్నపత్రాలు, మూల్యాంకనం విధానాలపై ఎగ్జామినర్లకు శిక్షణ ప్రారంభమైంది. మార్చి 1 నుంచి జరిగే థియరీ పరీక్షలకూ తరగతి గదుల్లో రెండు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను కూడా నిఘా నీడన నిర్వహించేందుకు టెన్త్ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,300 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5.2 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఒక్కో తరగతి గదిలో రెండు చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పాఠశాలల్లోనే పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించింది.