తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు సూచన
సాక్షి, హైదరాబాద్: జంతు హింసను నిరోధించేందుకు అన్ని పశువుల మార్కెట్‌లలో ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన విధంగా సీసీ కెమెరాల ఏర్పాటునకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ విషయంలో పిటిషనర్ సమర్పించే వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో ఇక తదుపరి విచారణ అవసరం లేదని, విచారణను ఇంతటితో ముగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పిఠాపురం మునిసిపాలిటీ పరిధిలోని పశువుల మార్కెట్‌లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని, జంతు హింస నిరోధానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేలా అధికారులను ఆదేశించాలంటూ జంతు రక్షణ సంఘం, గో సంరక్షణ ఫెడరేషన్, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.దీన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, జంతువులను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను, జంతువులను విడిపించేందుకు పిటిషన్లు దాఖలైనప్పుడు వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని ఇప్పటికే అన్ని కోర్టుల పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు తగిన సూచనలు ఇచ్చామన్నారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి స్పందిస్తూ, పశువుల మార్కెట్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ స్పందిస్తూ తాము అన్ని మార్కెట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దీంతో ఆ వ్యాజ్య పరిధిని తెలంగాణకు కూడా విస్తరించిన ధర్మాసనం తెలంగాణ సర్కార్‌కు పై విధంగా ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.