1.5 లక్షల మందికి చేప ప్రసాదం
- ముగిసిన చేప ప్రసాద వితరణ
- 4 ప్రత్యేక కేంద్రాల్లో ప్రసాదం నేడు, రేపు
హైదరాబాద్: ఆస్తమా వ్యాధిగ్రస్తుల కోసం బత్తిన సోదరులు చేపట్టిన చేప ప్రసాద వితరణ ముగిసింది. గురువారం ఉదయం 9 గంటలకు మృగశిర కార్తె ఆరంభాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాద పంపిణీ చేపట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 9.30 గంటల వరకు చేప ప్రసాదాన్ని భక్తులకు అందచేశారు. సుమారు ఒకటిన్నర లక్షల మందికి చేప ప్రసాదం అందజేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. రాత్రంతా నిర్విరామంగా 32 కౌంటర్లలో ప్రసాదాన్ని రోగులకు అందజేశారు.
రాత్రి 7 గంటలకే వీఐపీ కేంద్రాలు మూసివేయడంతో కొందరు వీఐపీ పాసు కలిగిన రోగులు జనరల్ కౌంటర్లలోనే క్యూలో నిల్చోని ప్రసాదాన్ని స్వీకరించారు. అయితే, నగరంలోని కవాడీగూడ, కూకట్‌పల్లి, వనస్థలిపురం, దూద్‌బౌలిలో మరో రెండు రోజులపాటు చేపప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. ప్రసాదం వితరణ విజయవంతంగా ముగిసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి రోగులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించినట్లు చెప్పారు.
ఐదో తరాన్ని సిద్ధం చేశాం: హరినాథ్ గౌడ్
తాము నాలుగు తరాలుగా ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదాన్ని ఇస్తున్నామని, తాను నాల్గవ తరానికి చెందిన వాడినని బత్తిన హరినాథ్‌గౌడ్ తెలిపారు. చేపప్రసాదం పంపిణీకి వచ్చే తరాన్ని సంసిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ మందు ఆస్తమా ఉన్నవారికి ఒక ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు.
చేప ప్రసాదం పంపిణీ విజయవంతం: తలసాని
బత్తిన సోదరులు ప్రారంభించిన చేప ప్రసాదం పంపిణీ విజయవంతంగా ముగిసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నా రు. చేప ప్రసాదం పంపిణీకి సహకరించిన బత్తిన సోదరులు, జీహెచ్‌ఎంసీ, పోలీసులు, మెట్రో వాటర్ వర్క్స్, మెడికల్, విద్యుత్, రెవెన్యూ, ఎగ్జిబిషన్ సొసైటీ, మత్య్సశాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు రోగులకు భోజనం సౌకర్యం కల్పించినందుకు అభినందనలు తెలిపారు.