ఎస్‌హెచ్‌జీల రుణం రూ.10 లక్షలకు పెంపు
పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: స్వయం సహాయ మహిళా సం ఘాలకు(ఎస్‌హెచ్‌జీలకు) ఇస్తున్న రూ.5లక్షల ను రూ.10లక్షలకు పెంచనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం త్వరలోనే దీన్ని ప్రకటిస్తారన్నారు. జీహెచ్‌ంఎసీ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌జీలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు, బ్యాంకు రుణాల పంపిణీ కార్యక్రమం శని వారం నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజాలో జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పడు అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు.. ఇప్పుడు ఏ మాత్రం ఓపిక లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందన్న చివరి ముఖ్యమంత్రి పరిస్థితే నేడు అంధకారంగా మారిం దన్నారు.
బ్యాంకు రుణాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తదితర పథకాల కోసం దళారుల మాటలు నమ్మవద్దని చెప్పారు. అడిగినవారందరికీ లేదనకుండా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రాబోయే నాలుగేళ్లలో పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ నగరాభివృద్ధికి మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ దళారీ వ్యవస్థను మహిళలే తరిమికొట్టాలన్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ మహిళలంతా ఐక్యంగా ఉండి సంక్షేమ పథకాలు రాబట్టుకోవాలన్నారు.కార్యక్రమంలో ఎమ్మె ల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సలీం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మెప్మా ఎండీ దాన కిశోర్, సీఆర్‌వో బాలమాయాదేవి తదితరులు పాల్గొన్నారు.
వృత్తినైపుణ్య వర్సిటీకి కృషి
మహిళల కోసం దేశవ్యాప్తంగా 8 జాతీయ వృత్తి నైపుణ్య మహిళా వర్సి టీలు ఏర్పాటు కానున్నాయని కార్యక్ర మంలో పాల్గొన్న కేంద్ర మంత్రి దత్తాత్రేయ చెప్పారు. టీ-సర్కార్ ముందు కొస్తే అందులో ఒకటి హైదరాబాద్‌లో నిర్మిస్తామన్నారు. హైదరాబాద్‌లో నిర్మిం చే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లన్నింటికీ కేంద్ర సహకారం ఉంటుందని, ఒక్కో ఇంటికి రూ.2.5 లక్షలు ఇస్తామన్నారు. మహిళా గ్రూపులకు రూ.50 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ప్రతి బస్తీలో మహిళా సంఘాలకు కమ్యూనిటీహాళ్లు నిర్మిస్తే కేంద్రం తరపున మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.